పశువులకు ప్రాణాంతకం.. కుందేటి వెర్రి | pasuvulaku pranantakam.. kundeti verri | Sakshi
Sakshi News home page

పశువులకు ప్రాణాంతకం.. కుందేటి వెర్రి

Published Wed, Apr 12 2017 7:04 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

pasuvulaku pranantakam.. kundeti verri

జంగారెడ్డిగూడెం: పశువుల్లో వచ్చే వ్యాధుల్లో కుందేటి వెర్రి వ్యాధి ఒకటి. ఈ వ్యాధిని ‘సర్రా’ లేక ‘ట్రిపనోసోమియాసిస్‌’ అంటారు. ఈ వ్యాధి ఒంటెలు , గుర్రాలు, ఆవులు, గేదెలు, గొర్రెల్లో వస్తుంది. రక్తంలో ఉండే ‘ట్రిపనోసోమా’ అనే పరాన్నజీవి ఈ వ్యాధికి కారణం. టబానస్, స్టోమాక్సిస్‌ అనే జోరీగ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. అన్ని వయసు గల పశువులకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన గుర్రాలు, ఒంటెలు నూరు శాతం మరిణిస్తాయని, ఆవుల్లో ఈ వ్యాధి వల్ల గర్భస్రావం జరగడం, పాల దిగుబడి తగ్గడం జరుగుతుందని జంగారెడ్డిగూడెం పశువైద్యాధికారి బీఆర్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స ఆయన మాటల్లోనే..
లక్షణాలు:
వ్యాధి సోకిన పశువుల్లో 103 నుంచి 106 డిగ్రీల ఫారన్‌ హీట్‌ జ్వరం వస్తుంది. బరువు తగ్గిపోతాయి. నీరసంగా ఉంటాయి. వెర్రి చూపులు చూస్తాయి. కళ్లు, ముక్కు ఎర్రబడి వాటి నుంచి నీరు కారుతుంది. కాళ్లు, పొట్ట కింద భాగం, గొంతుపైన నీరు చేరి వాపు ఏర్పడుతుంది. కంటి చూపు మందగిస్తుంది. కొన్ని పశువులు పూర్తిగా కంటి చూపును కోల్పోతాయి. రక్తహీనత ఏర్పడుతుంది. పళ్లు కొరుకుతూ గుండ్రంగా తిరుగుతాయి. ఫిట్స్‌ వస్తాయి. అకస్మాత్తుగా పాల దిగుబడి తగ్గిపోతుంది. చూడి ఆవులు ఈసుకుపోతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గిపోయి చివరగా మరణిస్తాయి. 
వ్యాధి నిర్ధారణ..వ్యాధి సోకిన పశువుల నుంచి రక్తాన్ని సేకరించి గాజు పలకపైన పూతగా పూసి సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించినప్పుడు వ్యాధికారక పరాన్నజీవులు కనిపిస్తాయి. దీని ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స..వ్యాధి సోకిన ఆవులు, గేదెలకు డిమనిజన్‌ ఆసిట్యూరెట్‌ ఇంజక‌్షన్‌ను 100 కిలోగ్రాముల శరీర బరువుకు 350 మి.గ్రా చొప్పున కండరాలలోనికి ఇప్పించాలి. ఈ ఇంజక‌్షన్‌ ఇవ్వడానికి ముందు గ్లూకోజ్‌ ఇవ్వాలి.
నివారణ..వ్యాధి సోకిన పశువులను మిగలిన వాటి నుంచి వేరు చేయాలి. బాహ్య పరాన్నజీవుల నివారణ కోసం బూటక్స్‌ వంటి మందులు పశువుల చర్మంపై పిచికారీ చేయాలి. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. పశువుల కొట్టాలలో క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాలి. పశువులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement