ముచ్చుమర్రి మురళీధరుడు! | Kurnool district farmer focus on Ongole breed Animal wealth | Sakshi
Sakshi News home page

ముచ్చుమర్రి మురళీధరుడు!

Published Tue, Apr 25 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

ముచ్చుమర్రి మురళీధరుడు!

ముచ్చుమర్రి మురళీధరుడు!

గోధూళి వేళ.. నెమరేస్తూ ఊరు ముఖం పట్టిన ఆలమందలు.. అన్నింటికన్నా ముందు ఆరడుగులపైగా ఎత్తుతో వంపులు తిరిగిన విగ్రహం.. ముడతలు తేలిన చర్మం, తీక్షణమైన చూపులతో ఠీవిగా ఒక్కో అడుగు వేస్తూ నడిచే ఒంగోలు గిత్త భారతీయ పల్లెకు కొత్త వెలుగు. రాజసానికి, దర్పానికి నిలువెత్తు ప్రతీక. తరతరాల భారతీయ పశుసంపద పౌరుషానికి ప్రఖ్యాతి కూడా. కానీ వాటి ఘనతంతా గతం. యాంత్రీకరణతో రైతుల నిర్లక్ష్యం కొంత ప్రభుత్వం నిర్లిప్తత మరికొంత... వెరసి ఒంగోలు జాతి పశుసంపద గ్రహణం పట్టిన చంద్రుడులా అంతర్థానమయ్యే పరిస్థితి. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొడిగడుతున్న ఒంగోలు జాతి పశువు అనే దీపానికి ప్రేమ అనే చమురును ఇంధనంగా మార్చి కాచుకుంటున్న కారుణ్యమూర్తి ఆ రైతు.

రేపల్లెలో గో సంతతిని కాచుకున్న గోపాల కృష్ణుడుకు మల్లే ఒంగోలు జాతి పశుసంపద పరిరక్షణకు అహరహం పాటుపడుతున్నాడీ మురళీధరుడు. జాతీయ స్థాయి ఒంగోలు కేటిల్‌ బ్రీడ్‌ సేవియర్‌ అవార్డు –2016కు మురళీధరరెడ్డిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం. మే 21న హర్యానాలోని కర్నల్‌లో ఆయన ఈ అరుదైన పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా ‘సాగుబడి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం..  


దశాబ్దాల ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒంగోలు జాతి పశువుల పిండాలు, వీర్యం కోసం బ్రెజిల్‌ను అడుక్కునే దుస్థితికి చేర్చితే.. ఆ జాతి పశువులపై ఉన్న మమకారం ఓ సాధారణ రైతును కదిలించింది. ఆయన చేతి స్పర్శ ఒంగోలు జాతి పాలిట సంజీవనిగా మారి అంతర్జాతీయంగా ఆ గ్రామానికి కొత్త గుర్తింపును తెచ్చింది. 500లకు పైగా ఒంగోలు కోడెలను సాకిన ఆ దొడ్డ మనసు పెద్దాయన పేరు కాటం మురళీధర్‌రెడ్డి. కర్నూలు జిల్లా పగిడాల మండలం కొత్త ముచ్చుమర్రి ఆయన స్వగ్రామం. 1975 ప్రాంతంలో ట్రాక్టర్ల రాకతో అరకలకు కాలం చెల్లింది. మరోవైపు కూలీల రేట్లు పెరిగాయి. బీడు భూములు సాగు భూములుగా మారి పచ్చి మేత లభ్యత తగ్గింది. దీంతో గ్రామంలోని రైతులు క్రమంగా ఆవులను అమ్ముకోవటం ప్రారంభమైంది. కాటం మురళీధర్‌ రెడ్డికి చిన్నతనం నుంచి ఒంగోలు జాతి కోడెలంటే అమితమైన ఇష్టం. ఒంగోలు జాతి పశువులను పోగొట్టుకోవటానికి మనసొప్పలేదు. అన్నదమ్ముల వాటాలతో కలిపి వందకు పైగా ఎకరాల్లో సేద్యం చేస్తూనే మరో చేత ఒంగోలు గిత్తల పోషణ చేస్తూ పశువుల పరిరక్షణకు కృషి చేస్తున్నారు.  నాటి నుంచి నేటి వరకు ఆయన జీవితం వాటికే అంకితం అయింది.

ఆ ఇల్లు రేపల్లె..
ఐదేళ్ల క్రితం వరకు మురళీధర్‌రెడ్డి కల్లం దొడ్లు, ఇల్లు ఒంగోలు జాతి పశుసంపదతో నిండి కంటికి విందు చేసేవి.Sకానీ వరిగడ్డి ధరలు పెరిగి పోషణ కష్టమవటంతో యాబైకి పైగా ఉన్న ఒంగోలు జాతి పశువులను అమ్మేశారు. ప్రస్తుతం మురళీధర్‌ రెడ్డి వద్ద ఆరు ఒంగోలు జాతి గిత్తలు, 10 ఆవులు, రెండు ఆంబోతులున్నాయి. వీటిలో కొన్నింటిని పేరుతో పిలిస్తే చాలు ఎక్కడున్నా పరుగుతో ఆయన చెంతకు చేరతాయి. ఆయన చేయి పడగానే పొగరు బోతు గిత్తలు సైతం కుక్కపిల్లలా ముడుచుకుంటాయి. వారి కుటుంబంలోని సభ్యుల్లా మారిపోయాయి. కొన్నాళ్ల క్రితం వరకు కంటికి కనిపించేలా ఇంటివాకిట్లోనే వాటిని కట్టేసేవారు. ఊరు విడిచి వెళ్లినా ఆయన మనసు మాత్రం వీటిని వదలి వెళ్లదు. ఇంటికి తిరిగొచ్చి వాటి మేను తాకి పలకరించి పులకరించేదాక మనసు ఉగ్గబట్టదు. వాటి ఆలనా పాలనా గురించి ఎప్పటికప్పుడు ఫోన్‌లో సూచనలిచ్చి జీతగాళ్లను పురమాయిస్తాడు.

ఒంగోలు జాతి పశువుల పెంపకం కోసం మురళీధర్‌రెడ్డి ప్రత్యేకంగా ముగ్గురు జీతగాళ్లను నియమించారు. ఆరెకరాల్లో సాగు చేసిన జొన్నపైరును పచ్చిమేతగా ఇస్తారు. వరిగడ్డి, జొన్న చొప్ప, వేరుశనగ కట్టెను ఎండుమేతగా ఇస్తారు. ఒక్కో ఒంగోలు గిత్త పోషణకు ఏడాదికి రూ. 50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న దాణా ఇస్తారు. ఉదయం సాయంత్రం ఐదు కిలోల చొప్పున ఉలవల దాణా పెడతారు. వేసవిలో మాత్రం ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రత్యేకంగా రాగులతో తయారు చేసిన దాణా పెడుతున్నారు. ఉలువలు, బెల్లంతో చేసిన పూర్ణాలు తినిపిస్తారు. మధ్యాహ్నం కిలోన్నర రాగులు/ బార్లీ గింజలతో చేసిన జావను ఇస్తారు. ప్రతి కోడెకు ఫ్యాన్‌లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేసి గాలి తగిలే ఏర్పాటు చేశారు.

ఒంగోలు జాతి పశువులకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పెద్దగా వ్యాధులు సోకవు. సీజనల్‌గా వచ్చే వ్యాధులు సోకకుండా టీకాలు వేయిస్తారు. ప్రతి నెలా పశువైద్యుడి చేత వైద్య పరీక్షలు చేయిస్తారు. నొప్పులు, చర్మవ్యాధుల నివారణకు స్థానికంగా లభించే ఆకు పసర్లు వాడుతున్నారు. పొదుగు వాపు వ్యాధి నివారణకుSఅల్లోపతి మందులు వాడుతున్నారు. ఒంగోలు ఆవులను మేలుజాతి ఒంగోలు ఆంబోతులతో దాటించడం ద్వారా సంతానాన్ని వృద్ది చేస్తున్నారు.

ఒక్కో గిత్త ఖరీదు రూ. 10–25 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ఒంగోలు గిత్తలను కొనేందుకు ముచ్చుమర్రికి వస్తుంటారు. బ్రెజిల్‌ దేశస్ధులు కూడా  మురళీధర్‌రెడ్డి  వద్ద గిత్తలను కొనుగోలు చేశారు. అలా ఆయన అమ్మిన 500కు పైగా గిత్తలు, ఆవులు రెండు తెలుగు రాష్ట్రాల్లోను నలుచెరగులా ఉన్నాయి. ఆరేళ్ల వయసున్న గిత్తలు రూ. 10 నుంచి 25 లక్షల ధరకు విక్రయిస్తున్నారు. ఏడాదిన్నర వయసున్న కోడె దూడ కనీసం రూ. 2 లక్షల వరకు ధర పలుకుతోంది.

కాటం మురళీధర్‌రెడ్డి అభివృద్ధి చేసిన ఒంగోలు జాతి కోడెలు రాష్ట్రంలోనే గాక జాతీయ స్థాయి పశువుల పోటీల్లోనూ సత్తా చాటాయి. అవార్డులు, ప్రశంసాపత్రాలు, నగదు బహుమతుల పంట పండించాయి. ఇప్పటివరకు 100 అవార్డులు, నగదు బహుమతులు లభించాయి. 1994లో ఢిల్లీలో జరిగిన పశువుల పోటీలకు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రత్యేక బోగిని ఏర్పాటు చేసి మూడు గిత్తలు రెండు ఆవులను తీసుకెళ్లగా మొదటి స్థానంలో నిలిచాయి. గుంటూరు, తిరుపతిలో జరిగిన అందాల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి.

ఎటైనా పోటీలకు తీసుకెళ్లాలంటే లారీలో గడ్డిపరిచి, కర్రలతో అడ్డుకట్టలు కట్టి జాగ్రత్తగా తీసుకెళతారు. పశువుల రవాణాలో అనుభవం ఉన్న డ్రైవర్లు లారీ నడుపుతారు. జీతగాళ్లు వాటి వెంట ఉండి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటారు. 1994, 1996లో గుంటూరులో.. ఆల్‌ ఇండియా క్యాటిల్‌ షో(1998)లో మొదటి స్థానం గెలుచుకున్నాయి. ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకే జీవితం అంకితం చేసిన అవిశ్రాంత కృషీవలుడు మురళీధర్‌రెడ్డి.    
– గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు ఫొటోలు : పక్కీరయ్య, పగిడాల

ప్రభుత్వాలు మేల్కొనకపోతే ఒంగోలు జాతి మనుగడ కష్టం
ప్రస్తుతం కృత్రిమ గర్భోత్పత్తి వల్ల కోడెదూడల్లో నాణ్యత తగ్గిపోతోంది. మేలు జాతి కోడెదూడల కోసం నాణ్యమైన జాతుల పశువుల వీర్యాన్ని సేకరించి స్పెర్మ్‌ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచాలి.

ఒంగోలు బ్రీడ్‌ అంతరించి పోకూడదనే వీటిని అభివృద్ధి చేస్తున్నాను. వీటి పోషణ సులభం కాదు. వ్యవసాయంలో సంపాదించిన దంతా ఖర్చు పెడుతున్నా. ఒంగోలు జాతి పశువుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా వందల్లోకి పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలోనే ఒంగోలు జాతి పూర్తిగా కనుమరుగవుతుంది. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఒంగోలు గిత్తల ధర లక్షల్లో పలుకుతున్నాయి. చిన్న రైతులకు వీటి పెంపకం కష్టమే. ఆసక్తి ఉన్న వాళ్లకు పోషణలో మెళకువలు నేర్పుతాను.
– కాటం మురళీధర్‌ రెడ్డి (94402 91877),
ఒంగోలు జాతి పశు పోషకులు, కొత్త ముచ్చుమర్రి, పగిడాల మండలం, కర్నూల్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement