సాక్షి, హైదరాబాద్: గోసంరక్షణ చట్టం, గోవధ నిషేధ చట్టం–2011కు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని సైతం అమలు కావడం లేదని, ఆవులను వధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తిరుమల, తిరుపతి దేవస్థానాల బోర్డు మెంబర్, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బక్రీద్ పేరుతో వేలాదిగా ఆవుల్ని, కోడె దూడల్ని సైతం వధిస్తారని, తక్షణమే తమ పిల్‌ను విచారణకు చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ చేసిన విజ్ఙప్తిని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆమోదించింది. మంగళవారం పిల్‌ను విచారణ చేస్తామని సోమవారం బెంచ్ హామీ ఇచ్చింది.
పాడి,సాగులకు యోగ్యమైన వాటిని వధించకూడదని, వాహనాల్లో ఆవులు,ఎద్దుల్ని కుక్కేసి రవాణా చేయకూడదని ఇటీవల కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను, వేటిని వధించవచ్చునో పశువైద్యుడు నిర్ధారించిన తర్వాతే నిర్ధిష్ట వధశాల్లో పశువైద్యుడి సమక్షంలోనే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రాష్ట్రంలో అమలు కావడం లేదని పిల్‌లో పేర్కొన్నారు. ఆవులను అక్రమ రవాణా అవుతుంటే రాష్ట్ర పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, చెక్‌పోస్ట్‌ల వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి హైకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చేయాలని కోరారు. ఆవులు, కోడెదూడల అక్రమ రవాణా అవుతుంటే గోవు పూజ్యనీయమని భావించే వాళ్లు అడ్డుకుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని పోలీసులు ఉల్టా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పోలీసులు అమలు చేయనందుకే సీఆర్‌పీఎఫ్ బలగాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని శివకుమార్ దాఖలు చేసిన పిల్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment