Cattle smuggling
-
ఆవులు, దూడలను తరలించొద్దు
అనంతగిరి: బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆవులు, లేగ దూడలను తరలించొద్దన్నారు. ఇతర పశువులను తీసుకెళ్లే వారు ఫిట్ ఫర్ స్లాటర్ పత్రాలు, పశువును తరలిస్తున్న వాహనాల పత్రాలు తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని తెలిపారు. వాహనంలో ఒక్కో పశువు మధ్య రెండు స్క్వేర్ మీటర్ల స్థలం ఉండాలన్నారు. వాహనాల్లో పరిమితికి మించి, ఎక్కువ సంఖ్యలో తరలించకూడదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే అక్రమ రవాణాగా పరిగణించి పశువులను గోశాలలకు తరలిస్తామని తెలిపారు. పది చెక్ పోస్టులు పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పది చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పశువులు కలిగిన వాహనాలను అనధికారికంగా అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డీటీసీ అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా వెటర్నరీ అధికారి అనిల్ కుమార్ జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, వికారాబాద్, పరిగి, తాండూరు అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు. -
స్మగ్లింగ్ మాఫియా దారుణం.. మహిళా ఎస్సైని లారీతో తొక్కించి హత్య
రాంచీ: హర్యానా మైనింగ్ మాఫియా చేతిలో హత్యకు గురయ్యారు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో దారణం చోటు చేసుకుంది. డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం రాత్రి జరిగింది. రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య టోప్నే. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చి ఎస్సైని తొక్కించారు. ‘పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో ఎస్సైని ఢీకొట్టాడు డ్రైవర్. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశాం. ’అని సీనియర్ ఎస్పీ కౌశల్ కిశోర్ తెలిపారు. హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారిని మైనింగ్ మాఫియా హత్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: Haryana DSP Murder: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
గోవధ ఆపాలంటూ హైకోర్టులో వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: గోసంరక్షణ చట్టం, గోవధ నిషేధ చట్టం–2011కు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని సైతం అమలు కావడం లేదని, ఆవులను వధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తిరుమల, తిరుపతి దేవస్థానాల బోర్డు మెంబర్, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బక్రీద్ పేరుతో వేలాదిగా ఆవుల్ని, కోడె దూడల్ని సైతం వధిస్తారని, తక్షణమే తమ పిల్‌ను విచారణకు చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ చేసిన విజ్ఙప్తిని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆమోదించింది. మంగళవారం పిల్‌ను విచారణ చేస్తామని సోమవారం బెంచ్ హామీ ఇచ్చింది. పాడి,సాగులకు యోగ్యమైన వాటిని వధించకూడదని, వాహనాల్లో ఆవులు,ఎద్దుల్ని కుక్కేసి రవాణా చేయకూడదని ఇటీవల కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను, వేటిని వధించవచ్చునో పశువైద్యుడు నిర్ధారించిన తర్వాతే నిర్ధిష్ట వధశాల్లో పశువైద్యుడి సమక్షంలోనే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రాష్ట్రంలో అమలు కావడం లేదని పిల్లో పేర్కొన్నారు. ఆవులను అక్రమ రవాణా అవుతుంటే రాష్ట్ర పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, చెక్‌పోస్ట్‌ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి హైకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చేయాలని కోరారు. ఆవులు, కోడెదూడల అక్రమ రవాణా అవుతుంటే గోవు పూజ్యనీయమని భావించే వాళ్లు అడ్డుకుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని పోలీసులు ఉల్టా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పోలీసులు అమలు చేయనందుకే సీఆర్పీఎఫ్ బలగాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని శివకుమార్ దాఖలు చేసిన పిల్లో కోరారు. -
అక్రమార్కుల కొత్త పంథా..
సాక్షి, పార్వతీపురం (విజయనగరం): పశువుల తరలింపులో వ్యాపారుల పంథా మారింది. ఇదివరకు పార్వతీపురం మార్కెట్ యార్డు వద్ద వారపు సంతలో పశువులను కొనుగోలు చేసి బొలేరో వాహనాల్లో తరలించేవారు. అయితే ఇటీవల జోరుగా సాగుతున్న అక్రమ పశురవాణాను అరికట్టేందుకు పార్వతీపురం ఏఎస్సీ సుమిత్ గరుడ్ కళ్లెం వేశారు. మూగజీవాల చట్టం ప్రకారం ఒక బొలేరో వాహనంలో మూడు పశువుల కంటే ఎక్కువ ఎక్కించరాదంటూ స్పష్టం చేయడంతో పాటు దాడులు ముమ్మరం చేశారు. దీంతో అక్రమ పశువ్యాపారులకు ముకుతాడు వేసినట్లైంది. ఈ విధానం వ్యాపారులకు కలసి రాకపోవడంతో వారు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేసిస్తున్నారు. బొలేరో వాహనాల్లో పశువులను తరలిస్తుండటే పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో అక్రమార్కులు తమ పంథా మార్చుకున్నారు. పార్వతీపురం మార్కెట్లో కొనుగోలు చేసిన పశువులను కాలినడకన బొబ్బిలి వరకు తరలించి అక్కడ లోడింగ్ చేసి పంపిస్తున్నారు. కొన్ని పశువుల మందలను అలమండ వరకు తరలించి అక్కడ లోడింగ్ చేస్తున్నారు. అయితే జాతీయ రహదారిపై పశువుల మందలను నడిపించడంతో వాహనచోదకులకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్డుకడ్డంగా గుంపులు గుంపులుగా పశువులు వెళ్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడిన సంఘటనలున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశులు అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
యథేచ్ఛగా పశువధ
విశాఖపట్నం, చోడవరం: చోడవరం పరిసరాల్లో యథేచ్ఛగా పశువధ, కబేళాలు నిర్వహణ జరుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. చోడవరం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా పశువుల సంతలు ఉండడంతో కావలసిన పశువులను సులభంగా ఇక్కడకు తీసుకొస్తున్నారు. వడ్డాది, పీఎస్‌పేట, తిమిరాం, తుమ్మపాలల్లో పశువుల సంతలు భారీ స్థాయిలో జరుగుతాయి. ఆయా సంతల్లో ఒట్టిపోయిన, వయస్సు అయిపోయిన గేదెలను, లేకదూడలను కొనుగోలుచేసి ఇక్కడ వధిస్తున్నారు. ఇటీవల దీనిపై పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ పోలీసు యంత్రాంగం గాని, గో సంరక్షణ సమితి గాని అంతగా స్పందించక పోవడంతో పశువధకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చోడవరం శివారు శ్మశానవాటిక వద్ద ప్రత్యేకంగా ఓ ప్రదేశంలో నెలకు రెండు పర్యాయాలు గోవధ చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద సరంజామానే ఏర్పాటుచేశారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో పశువులను వధించి ఆ మాంసాన్ని ఐస్‌లో పెట్టి వ్యానుల్లో విశాఖపట్నం, విజయనగరంతోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిసింది. కొంతమంది ఒక యూనిట్‌గా ఏర్పడి ఈ అక్రమ మాంసం వ్యాపారం, పశువధ చేస్తున్నట్టు సమాచారం. గతంలో పోలీసులు దాడులు చేయడంతో మధ్యలో కొంత కాలం నిలిపివేయగా, మళ్లీ పశువులను వధిస్తూ మాంసం రవాణా ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకున్న పెందుర్తికి చెందిన శ్రీ సాయి గురుదత్త స్వామి ఆధ్వర్యంలో నిఘా ఉంచిన గో సంరక్షణ సమితి సభ్యులు సోమవారం అర్ధరాత్రి మాటువేసి గోవధ జరిగే ప్రదేశంపై దాడి చేశారు. అయితే ఆ సమయంలో నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో అక్కడ వధ చేయకుండా ఉన్న 10 లేగ దూడలను తీసుకొని వారు చోడవరం పోలీసులకు ఫిర్యాద చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారం ఎవరు చేస్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు. విశాఖపట్నం చెందిన కొందరు ఇక్కడ వాళ్లతో కలిసి ఈ వ్యవహారం చేస్తున్నారని తెలిసింది. 30 శాతం పశువులు కబేళాలకు ఇదిలావుండగా జిల్లాలో ఏటా 30 శాతం పశువులు ఇలా కబేళాలకు తరలిపోతున్నాయి. ఎక్కుగా డెయిరీలు ఈ జిల్లాలోనే ఉండడంతో పాడి పశువుల పెంపకం కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఒట్టిపోయిన ఆవులు, గేదెలు, పెయ్యిలు గాని లేగ దూడలలు వల్ల రైతులకు కలిసి రాకపోవడంతో సంతల్లో వాటిని దళారులకు అమ్మేస్తున్నారు. వీటిని కొనుగోలుచేసిన దళారులు కబేళాలకు తరలించే వారికి అమ్మేస్తున్నారు. తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేసి, విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై పోలీసులు, గో సంరక్షణ సమితి సభ్యులు మరింత దృష్టిసారించాల్సి ఉంది. గో వధను నిలువరించాలని పలువురు కోరుతున్నారు. చోడవరంలో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
అయ్యో...పాపం...!
గోమాతకు హిందూ సమాజంలో ఉన్న ప్రాధాన్యమే వేరు. గోమాతకు దక్కే గౌరవం చెప్పలేనిది. అటువంటి గోమాతల తరలింపులో కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో మూగజీవాలు అష్టకష్టాలు పడుతున్నాయి. తరలింపులో నిబంధనలు పాటించాల్సిన వారు వాటిని పట్టించుకోవడం లేదు. చివరకు కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, పార్వతీపురం: ప్రభుత్వం పాడి రైతులకు రాయితీపై మేలు జాతి పశువులను అందిస్తుంది. రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ మేలు జాతి పశువులను కొనుగోలు చేసి పాడి పశువుల పంపిణీ పథకం కింద రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పశువులను మన రాష్ట్రానికి తీసుకువస్తున్న సమయంలో మూగ జీవాల చట్టం పరిధిలోని నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఒకే లారీలో 20 వరకు ఆవులను ఎక్కించి వాటికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి లారీలో పశువులు చేరే సరికి మూడు రోజులు సమయం పడుతుంది. ఈ మూడు రోజుల పాటు లారీలో ఉన్న ఆవులకు ఆహారంగా పెట్టాల్సిన గడ్డిని కాని, దాణాను కాని, తాగునీటిని సమకూర్చకుండా వాటిని ఆకలితో మాడ్చేస్తున్నారు. ఈ కారణంగా మూగజీవాలు నరకం చూస్తున్నాయి. నిండు చూలుతో ఉన్న ఆ పశువులు తిండి తిప్పలు లేక కడుపులో పెరుగుతున్న దూడల ఆకలి తీర్చలేక కన్నీరు పెట్టుకుంటున్నాయి. కడుపులోనే మృత్యువాత మూడు రోజుల కిందట రాజస్థాన్ నుంచి బయలుదేరిన ఆవుల లారీ బుధవారం నాటికి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ లారీ ఒడిశా మీదుగా పార్వతీపురం చేరుకుని పార్వతీపురం మార్కెట్ యార్డుకు చేరుకుంది. లారీ డ్రైవర్లు ఆవులు పార్వతీపురం అనుకుని పార్వతీపురం మార్కెట్ యార్డులో దించేశారు. వారు ఆవులను కిందికి దించి లారీలో మత్తుగా నిద్రలోకి జారుకుంటున్నారు అయితే నిండు చూలాలతో ఉన్న ఆవుల్లో ఒక ఆవు కాన్పు సమయం కావడంతో ఒక దూడకు జన్మనిచ్చింది. మూడు రోజులుగా తిండి తిప్పలు లేకపోవడంతో కడుపులో దూడ మృతి చెందింది. ఇలా అనేక ఆవులు గర్భం దాల్చి ఉన్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. దూడకు జన్మనిచ్చిన ఆవుకు తీవ్ర గర్భస్రావం జరుగుతుంది. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మూగ జీవాలకు ఆహారం, తాగునీరు లేక దీనంగా కన్నీరు కారుస్తున్నాయి. -
పశు అక్రమ రవాణాకు బ్రేక్ పడేనా?
విజయనగరం , పార్వతీపురం: పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటూ సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ ఆదేశాలు అమలవుతాయా లేదా అన్న చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరందుకుంది. వాస్తవంగా జిల్లాలోని సంతల నుంచి పశు అక్రమరవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. మూగజీవాలను చిన్నచిన్న వాహనాల్లో కుక్కి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వీటిని అడ్డుకోవాలంటూ సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీచేయడం పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. పార్వతీపురంలో వ్యాపారం జోరు... పశువుల అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా పార్వతీపురం మారింది. సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా పార్వతీపురానికి దగ్గరగా ఉండడంతో పశువుల మందలు తండోప తండోలుగా పార్వతీపురానికి వ్యాపారులు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచే బొలేరో వాహనాల్లో పశువులను ఎక్కించి తరలిస్తున్నారు. ప్రతీ వారం సుమారు 100 వరకు బొలేరో వాహనాల్లో పశువులను ఎక్కించి జిల్లాను దాటిస్తున్నారు. ఇదంతా పార్వతీపురం మార్కెట్ యార్డు సాక్షిగా సాగుతుంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, అలమండ, శ్రీకాకుళం జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి పార్వతీపురం మార్కెట్‌యార్డులో పశువుల మందలను టోకున(మగత బేరం) కొనుగోలు చేసి బొలెరో వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రతీ గురువారం ఇక్కడ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ప్రతీ గురువారం 800 నుంచి 1000 వరకు పశువులను కొనుగోలు చేసి కొన్నింటిని బొలేరో వాహనాల్లో మరికొన్నింటిని కాలినడకన జిల్లా దాటిస్తున్నారు. ప్రతీ వారం పార్వతీపురం మార్కెట్ యార్డు కేంద్రంగా సుమారు రూ.50 లక్షల వరకు పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం. అధికారుల చర్యలు శూన్యం... పార్వతీపురం కేంద్రంగా పశువుల అక్రమ రవాణా జరుగుతున్న విషయం జగమెరిగిన సత్యం. ప్రతీ బుధ, గురువారాల్లో బొలేరో వాహనాల్లో పశువులను మూగజీవాల చట్టానికి విరుద్ధంగా ఇరికించి తరలిస్తున్నా ఏ ఒక్క అధికారి వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. పైగా రైతులు అవసరాలకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని ఉచిత సలహాలు ఇస్తున్నారంటే దీని వెనుక అసలు కారణం ఏమై ఉంటోందో ఊహిస్తే ఇట్టే అర్ధమౌతోంది. వాస్తవంగా పశువులను కొనుగోలు చేసే సమయంలో పశు వైద్యాధికారి నుంచి, మార్కెట్ కమిటీ సెక్రటరీ నుంచి, లేదంటే రవాణా శాఖ అధికారి నుంచి పశువులను ఏ అవసరం మేరకు కొనుగోలు చేశారో రసీదు తీసుకోవాలి. అయితే, వీరి వద్ద ఏ ఒక్క ధ్రువపత్రం లేకపోయినా దర్జాగా పవువులను బొలేరో వాహనాల్లో జిల్లాను దాటిస్తున్నారు. సబ్ కలక్టర్ ఆదేశాలు అమలు చేస్తారా? పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ అక్రమ పశురవాణాకు కళ్లెం వేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా శుక్రవారం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పశు అక్రమ రవాణాను అరికట్టాలని, మూగ జీవాల చట్టాన్ని పరిరక్షించాలని, అక్రమ కబేళాలలను మూసి వేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇంత వరకు ఏ ఒక్క అధికారి పశు అక్రమ రవాణాపై, అక్రమ కబేళాలపై దృష్టి సారించలేదు. సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తారా? లేక సరాసరి ఇది మామేలే అని తేలికగా తీసుకుని వ్యాపారులకు సహకరిస్తారో వేచి చూడాలి. హింసిస్తూ... మూగజీవాలను ఒడిశా నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి విజయనగరం జిల్లాకు దాటిస్తున్నారు. అక్కడి నుంచి అరకు, పాడేరు వరకు కాలి నడకన తరలించి అక్కడి నుంచి రహస్య మార్గంలో హైదరాబాద్, కేరళ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ పశువుల మందలను కాలినడకన వందల కిలోమీటర్లు నడిపిస్తున్న సమయంలో కర్రలతో కొట్టడం, సూదులతో గుచ్చి హింసిస్తున్నారు. కొన్ని పశుల కాళ్ల నుంచి రక్తం సైతం కారుతోంది. ఈ హింస ఏ ఒక్క అధికారికి కనిపించకపోవడం గమనార్హం. -
పట్టించుకునే వారేరీ..?
విజయనగరం, పార్వతీపురం: పట్టణంలోని మార్కెట్ యార్డు పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఇక్కడ ప్రశ్నించే వారు కాని.. అడ్డుకునే వారు కాని లేకపోవడంతో వ్యాపారులకు బాగా కలసివస్తోంది. మార్కెట్ యార్డులో ప్రతి గురువారం వారపు సంత జరుగుతుంది. ఇక్కడకు ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, అలమండ, తదితర మండలాల నుంచి వేల సంఖ్యలో పశువులను తీసుకువస్తుంటారు. వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వ్యాపారులు వస్తున్నారంటే వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువగా కనిపిస్తుంటారు. ప్రతి వారం 30 నుంచి 50 వరకు ఒట్టిపోయిన పశువుల మందలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ వ్యాపారులకు మంద మొత్తాన్ని ఒకేసారి టోకున విక్రయిస్తుంటారు. అడ్డుకట్ట లేదు... పార్వతీపురంలో రాయగడ రోడ్డు శివారున ప్రతి గురువారం జరిగే వారపు సంతలో ఎక్కువగా అనధికార విక్రయాలే జరుగుతుంటాయి. ఇక్కడ పశువులు విక్రయించాలన్నా, కొనుగోలు చేయాలన్నా మార్కెట్ కమిటీ అధికారుల నుంచి రశీదు పొందాల్సి ఉంటుంది. కాని ఎవ్వరూ రశీదులు తీసుకోకుండానే బొలేరో వాహనాల్లో పశువులను తరలించేస్తున్నా ఏ ఒక్కరూ ప్రశ్నించరు. నెలవారీ అందాల్సిన మామూళ్లు భారీగా అందుతుండడం వల్లే అధికారులు ప్రశ్నించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పాడి, దుక్కి అవసరాలకు పశువులు కొనుగోలు చేసుకుంటే పట్టుకుని మరీ వేధించే అధికారులకు బొలేరో వాహనాల్లో తరలిపోతున్న పశువులు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రూ. లక్షల్లో వ్యాపారం.. మార్కెట్‌యార్డు నుంచి ప్రతి వారం లక్షల రూపాయల్లో వ్యాపారం సాగుతుంది. సుమారు వెయ్యి వరకు పశువులు బుధ, గురువారాల్లో వాహనాల్లో తరలిపోతుంటాయి. పోలీసులు, ప్రజా సంఘాల నాయకులు, రవాణా శాఖాధికారుల నుంచి ఎటువంటి ముప్పు రాకుండా ఉండేందుకు ఒక అజ్ఞాత వ్యక్తి వ్యాపారుల నుంచి వారానికి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మార్కెట్ కమిటీ గడ్డిపాటను నిర్వహించకపోయినప్పటికీ ఆ అజ్ఞాత వ్యక్తి గడ్డిని సరఫరా చేస్తూ పశువుల వ్యాపారుల వద్ద భారీగా సొమ్మును వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇంత జరుగుతున్నా ఇటు మార్కెట్ కమిటీ అధికారులు గాని.. అటు పోలీసులు, రెవెన్యూ శాఖాధికారుల జాడే లేకపోవడం విశేషం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. రైతులవని చెబుతున్నారు.. గతంలో డీసీఎంలలో పశువులను తరలించే సమయంలో దాడి చేసి వాహనాలను సీజ్ చేశాం. ప్రస్తుతం బొలేరో వాహనాల్లో పశువులను తరలిస్తున్న సమయంలో దాడి చేస్తే రైతులవని చెబుతుండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. అయినప్పటికీ పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాం. ఇకపై పశువులు తరలించే వారి వద్ద కచ్ఛితంగా రైతు అవసరాలకు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ పత్రాలు ఉంటేనే అనుమతిస్తాం.– ఉప్పిలి మహేష్, ఎస్సై, పార్వతీపురం -
‘ఆళ్వార్ మూకదాడి’పై చర్యలేవి?
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో జరిగిన మూకదాడి ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో 7రోజుల్లోగా నివేదిక అంద జేయాలని స్పష్టం చేసింది. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఆళ్వార్‌లో గత జూలై 20న రక్బార్ ఖాన్ అనే పాడిరైతుపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించాడు. ఈ ఘటనకు సంబం ధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదలంటూ కోర్టు ధిక్కర ణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాలా దాఖలు చేశారు. ప్రభుత్వ సీఎస్, డీజీపీలతోపాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ ఘటనపై ఏమీ చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని రాజస్తాన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. మూకదాడులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం కొత్త చట్టం చేసే అంశానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అంగీకారాన్ని తెలుపుతూ సెప్టెంబర్ 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. -
‘దందా’నా.. పీఏ ‘దందా’నా..
పశువుల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. తెరవెనుక కొందరు బడాబాబులు గో సంరక్షణ పేరుతో పశు మాఫియాను ముప్ఫై గేదెలు, అరవై గోవులుగా యథేచ్ఛగా నడుపుతున్నారు. రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతి లేకుండా మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నా పోలీసులు వీరిని ఏం చేయలేకపోతున్నారు. దీనికి కారణం జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏ హస్తం ఉండడమే. పశువుల రవాణా వాహనాలను పోలీసులు పట్టుకుంటే చాలు వెంటనే ఆ పీఏ నుంచి ఫోన్ వెళుతుంది. దీంతో వారు ఏం చేయలేకపోతున్నారు. ఒక వేళ వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేసినా.. వాటిలో పశువులు మాత్రం యథావిధిగా గోశాల ద్వారా మాఫియా చెరలోకి వెళుతున్నాయి. రవాణా ఇలా.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో జరిగే పశువుల సంతలో కేరళ, తమిళనాడు, తెలంగాణా, కర్నాటకకు చెందిన బడా వ్యాపారులు పశువులను దళారీలతో కొనుగోలు చేయిస్తారు. వీటిని వివిధ రకాల వాహనాల్లో జాతీయ రహదారి మీదుగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇది రూ.కోట్లలో జరిగే వ్యాపారం కావడంతో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చూపు దీనిపై పడింది. తనకు ఉన్న అధికార దండాన్ని ప్రయోగించి బడా వ్యాపారులను లోంగదీసుకున్నాడు. విశాఖ జిల్లా వరకు రవాణా సజావుగా సాగినా, తూర్పు గోదావరిలోకి వచ్చే సరికి అజ్ఞాత వ్యక్తి చెప్పినట్టు వినాల్సి వస్తోందని వ్యాపారులే చెబుతున్నారు. ఎవరైనా మాటవినక పోతే గోసంరక్షణ సమితి పేరిట పోలీసులకు ముందుగానే వాహనం నంబర్‌తో సహా సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాటిని పట్టుకుని గోశాలకు అప్పగిస్తున్నారు. ఆ తర్వాత అదే వ్యాపారులకు వీటని దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికి ఎంతెంత.. తుని నుంచి రాజమహేంద్రవరం, రావులపాలెం వరకు ఉన్న పోలీస్స్టేషన్లను దాటించి వానాలను పంపడానికి బడా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూళ్లు చేస్తున్నారు. కంటైనర్‌కు రూ.17,000 వసూలు చేస్తే ఇందులో పోలీసుల కోసం రూ. 15,000 గోశాలకు రూ.రెండు వేలు తీసుకుంటున్నారు. తుని నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల్లో పశువులను రవాణా చేస్తున్నారు. సుమారు రోజుకు రూ.3.60 లక్షలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో పాయకరావుపేట నుంచి రాజమహేంద్రవరం వరకు ఉన్న పోలీస్స్టేషన్లు, తేటగుంట ఆర్టీఏ చెక్ పోస్టుకు ముడుపులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.పది వేల వరకు ముడుపులు ఇవ్వగా సదరు మాఫియాకు. రూ.ఏడు వేలు మిగులుతోంది. అంటే రోజుకు రూ.లక్షకుపైగా ఆదాయం పొందుతున్నారు. నెలకు రూ.30 లక్షలు, ఏడాదికి రూ.3.60 కోట్లు ఇలా దందా కొనసాగుతోంది. తుని కేంద్రంగా దందా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువులను తాండవ సుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని ప్రవేటు స్థలంలో దించి, అక్కడి నుంచి లారీల్లోకి ఎక్కించి పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం పెద్ద లారీలో 12 పశువులను ఎక్కించాలి. వీళ్లు మాత్రం 30 నుంచి 40 వరకు కుక్కుతున్నారు. అవరమైతే పశువుల కాళ్లు విరిచేస్తున్నారు. ఇదంతా రాత్రి 12 గంటల తర్వాత జరుగుతోంది. ఎవరైనా ప్రశ్నించినా మీకు సంబంధం ఏమిటని గర్జిస్తున్నారు. ఇంత జరుగతున్నా పోలీసులు అడపాదడపా కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. అక్రమంగా గోమాంసం తరలింపు.. వాహనం సీజ్, ఇద్దరిపై కేసు నమోదు కొత్తపల్లి (పిఠాపురం): అక్రమంగా బీచ్ రోడ్డులో గోమాంసాన్ని తరలిస్తున్న ఐషర్ వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముం దస్తు సమాచారం మేరకు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ సిబ్బందితో బీచ్ రోడ్డులో వెళుతున్న వాహనాన్ని గుర్తించి పట్టుకున్నా రు. ఆయన కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి టాటా ఐషర్ ఏపీ31టీహెచ్4971 గల వ్యాన్‌లో పశు మాంసాన్ని ఉప్పాడ మీదుగా సామర్లకోటకు కాకినాడ బీచ్ రోడ్డులో తరలిస్తున్నారు. సుమారు మూడున్నర టన్నులు ఉన్న ఈ మాంసం విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉం టుంది. మాంసాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను సీజ్ చేసి మాంసాన్ని కొనుగోలు చేసిన అల్తాప్, డ్రైవర్ టి.జగ్గారావులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఉప్పాడ గ్రామ రెవె న్యూ అధికారి పర్యవేక్షణలో ఉప్పాడ బీచ్ రోడ్డులో పూడ్చివేసి ఎస్సై కేవీఎస్ సత్యనా రాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మాంసాన్ని కొత్తపల్లి పశువైద్యాధికారి రవిబాబు పరిశీలించారు. సుమారుగా 15 గేదెల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఉదయం 6.30 నుంచి 8.30 లోపు తరలింపు ప్రతిరోజూ విజయనగరం, విశాఖపట్నం నుంచి ఉదయం 6.30 నుంచి 8.30 మధ్య అనేక వాహనాల్లో అక్రమంగా పశుమాంసాన్ని బీచ్ రోడ్డులో తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొంత మంది పోలీసు సిబ్బంది మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడులు
విజయనగరం టౌన్: స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం వారు ఎస్పీ జి.పాలరాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఖైనీ, గుట్కా, పశువుల అక్రమ రవాణాదారులపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఎస్పీ సోమవారం వివరాలు వెల్లడించారు. దాడుల్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ సురేంద్రనాయుడు, కౌంటర్ ఇంటలిజెన్స్ ఏఎస్ఐ జోగారావు, జానీ, హుస్సేన్, శ్రీను, రాజశేఖర్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. దాడుల వివరాలు.. ► స్పెషల్ బ్రాంచ్ ప్రత్యేక విభాగం ఆదివారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో రెండు టాటా గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్న 27 పశువుల మాంసాన్ని పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించారు. ►నెల్లిమర్ల మండలం జరజాపుపేట గ్రామంలో ఖైనీ, గుట్కా, సిగిరెట్లను అక్రమంగా విక్రయిస్తున్న నాగుల భాస్కరారవును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆయన నుంచి రూ.5 లక్షల విలువైన నిషేధిత సరుకును స్వాధీనం చేసుకుని, నెల్లిమర్ల పోలీసులకు అప్పగించారు. ► పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.60 వేల విలువైన ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని పేర్ల త్రినాధ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. ► పట్టణంలోని పుచ్చలవీధిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి పతివాడ పైడిరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, రూ.10 వేల విలువైన ఖైనీ,గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ని టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ► జామి మండలం అలమండ సంత సమీపంలో ఏపీ 24 టీసీ 4918 వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 12 ఆవులను, ఆరు లేగ దూడలను స్వాధీనం చేసుకుని, తెలంగాణలోని భువనగిరికి చెందిన బండ శ్రీధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని జామి పోలీసులకు అప్పగించారు. ► పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్వతీపురం, కొమరాడ మండలంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి, 11 మందిని అదుపులోనికి తీసుకుని వారి నుంచి రూ.32 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్వతీపురం రూరల్ పోలీసులకు వారిని అప్పగించారు. -
మెదక్ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు
-
మెదక్ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు
మెదక్: ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై మెదక్ సరిహద్దుల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రామాయంపేట సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 3 చెక్ పోస్టుల వద్ద వాహనాన్నిఆపకుండా వెళ్తన్న డీసీఎం వ్యానును స్థానిక పోలీసులు వెంబడించారు. వ్యానులో ఆవులను తరలిస్తున్న 8 మంది హర్యానా వాసులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రాయాయంపేట కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో హర్యానా వాసులపై పోలీసలు కాల్పులు జరిపారు. పేట్ బషీర్ వద్ద డీసీఎంను పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై విచారణ జరుపుతున్నారు.