
పశువులను బొలేరో వాహనాల్లో ఎక్కించి తొక్కుతున్న దృశ్యం(ఫైల్)
విజయనగరం, పార్వతీపురం: పట్టణంలోని మార్కెట్ యార్డు పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఇక్కడ ప్రశ్నించే వారు కాని.. అడ్డుకునే వారు కాని లేకపోవడంతో వ్యాపారులకు బాగా కలసివస్తోంది. మార్కెట్ యార్డులో ప్రతి గురువారం వారపు సంత జరుగుతుంది. ఇక్కడకు ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, అలమండ, తదితర మండలాల నుంచి వేల సంఖ్యలో పశువులను తీసుకువస్తుంటారు. వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వ్యాపారులు వస్తున్నారంటే వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువగా కనిపిస్తుంటారు. ప్రతి వారం 30 నుంచి 50 వరకు ఒట్టిపోయిన పశువుల మందలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ వ్యాపారులకు మంద మొత్తాన్ని ఒకేసారి టోకున విక్రయిస్తుంటారు.
అడ్డుకట్ట లేదు...
పార్వతీపురంలో రాయగడ రోడ్డు శివారున ప్రతి గురువారం జరిగే వారపు సంతలో ఎక్కువగా అనధికార విక్రయాలే జరుగుతుంటాయి. ఇక్కడ పశువులు విక్రయించాలన్నా, కొనుగోలు చేయాలన్నా మార్కెట్ కమిటీ అధికారుల నుంచి రశీదు పొందాల్సి ఉంటుంది. కాని ఎవ్వరూ రశీదులు తీసుకోకుండానే బొలేరో వాహనాల్లో పశువులను తరలించేస్తున్నా ఏ ఒక్కరూ ప్రశ్నించరు. నెలవారీ అందాల్సిన మామూళ్లు భారీగా అందుతుండడం వల్లే అధికారులు ప్రశ్నించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పాడి, దుక్కి అవసరాలకు పశువులు కొనుగోలు చేసుకుంటే పట్టుకుని మరీ వేధించే అధికారులకు బొలేరో వాహనాల్లో తరలిపోతున్న పశువులు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రూ. లక్షల్లో వ్యాపారం..
మార్కెట్‌యార్డు నుంచి ప్రతి వారం లక్షల రూపాయల్లో వ్యాపారం సాగుతుంది. సుమారు వెయ్యి వరకు పశువులు బుధ, గురువారాల్లో వాహనాల్లో తరలిపోతుంటాయి. పోలీసులు, ప్రజా సంఘాల నాయకులు, రవాణా శాఖాధికారుల నుంచి ఎటువంటి ముప్పు రాకుండా ఉండేందుకు ఒక అజ్ఞాత వ్యక్తి వ్యాపారుల నుంచి వారానికి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మార్కెట్ కమిటీ గడ్డిపాటను నిర్వహించకపోయినప్పటికీ ఆ అజ్ఞాత వ్యక్తి గడ్డిని సరఫరా చేస్తూ పశువుల వ్యాపారుల వద్ద భారీగా సొమ్మును వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇంత జరుగుతున్నా ఇటు మార్కెట్ కమిటీ అధికారులు గాని.. అటు పోలీసులు, రెవెన్యూ శాఖాధికారుల జాడే లేకపోవడం విశేషం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
రైతులవని చెబుతున్నారు..
గతంలో డీసీఎంలలో పశువులను తరలించే సమయంలో దాడి చేసి వాహనాలను సీజ్ చేశాం. ప్రస్తుతం బొలేరో వాహనాల్లో పశువులను తరలిస్తున్న సమయంలో దాడి చేస్తే రైతులవని చెబుతుండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. అయినప్పటికీ పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాం. ఇకపై పశువులు తరలించే వారి వద్ద కచ్ఛితంగా రైతు అవసరాలకు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ పత్రాలు ఉంటేనే అనుమతిస్తాం.– ఉప్పిలి మహేష్, ఎస్సై, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment