పరిమితికి మించి లారీలో కుక్కిన పశువులు,మాంసాన్ని పరిశీలిస్తున్న పశువైద్యాధికారి రవిబాబు, ఎస్సై సత్యనారాయణ
పశువుల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. తెరవెనుక కొందరు బడాబాబులు గో సంరక్షణ పేరుతో పశు మాఫియాను ముప్ఫై గేదెలు, అరవై గోవులుగా యథేచ్ఛగా నడుపుతున్నారు. రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతి లేకుండా మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నా పోలీసులు వీరిని ఏం చేయలేకపోతున్నారు. దీనికి కారణం జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏ హస్తం ఉండడమే. పశువుల రవాణా వాహనాలను పోలీసులు పట్టుకుంటే చాలు వెంటనే ఆ పీఏ నుంచి ఫోన్ వెళుతుంది. దీంతో వారు ఏం చేయలేకపోతున్నారు. ఒక వేళ వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేసినా.. వాటిలో పశువులు మాత్రం యథావిధిగా గోశాల ద్వారా మాఫియా చెరలోకి వెళుతున్నాయి.
రవాణా ఇలా..
ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో జరిగే పశువుల సంతలో కేరళ, తమిళనాడు, తెలంగాణా, కర్నాటకకు చెందిన బడా వ్యాపారులు పశువులను దళారీలతో కొనుగోలు చేయిస్తారు. వీటిని వివిధ రకాల వాహనాల్లో జాతీయ రహదారి మీదుగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇది రూ.కోట్లలో జరిగే వ్యాపారం కావడంతో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చూపు దీనిపై పడింది. తనకు ఉన్న అధికార దండాన్ని ప్రయోగించి బడా వ్యాపారులను లోంగదీసుకున్నాడు. విశాఖ జిల్లా వరకు రవాణా సజావుగా సాగినా, తూర్పు గోదావరిలోకి వచ్చే సరికి అజ్ఞాత వ్యక్తి చెప్పినట్టు వినాల్సి వస్తోందని వ్యాపారులే చెబుతున్నారు. ఎవరైనా మాటవినక పోతే గోసంరక్షణ సమితి పేరిట పోలీసులకు ముందుగానే వాహనం నంబర్‌తో సహా సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాటిని పట్టుకుని గోశాలకు అప్పగిస్తున్నారు. ఆ తర్వాత అదే వ్యాపారులకు వీటని దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
ఎవరికి ఎంతెంత..
తుని నుంచి రాజమహేంద్రవరం, రావులపాలెం వరకు ఉన్న పోలీస్‌స్టేషన్లను దాటించి వానాలను పంపడానికి బడా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూళ్లు చేస్తున్నారు. కంటైనర్‌కు రూ.17,000 వసూలు చేస్తే ఇందులో పోలీసుల కోసం రూ. 15,000 గోశాలకు రూ.రెండు వేలు తీసుకుంటున్నారు. తుని నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల్లో పశువులను రవాణా చేస్తున్నారు. సుమారు రోజుకు రూ.3.60 లక్షలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో పాయకరావుపేట నుంచి రాజమహేంద్రవరం వరకు ఉన్న పోలీస్‌స్టేషన్లు, తేటగుంట ఆర్టీఏ చెక్ పోస్టుకు ముడుపులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.పది వేల వరకు ముడుపులు ఇవ్వగా సదరు మాఫియాకు. రూ.ఏడు వేలు మిగులుతోంది. అంటే రోజుకు రూ.లక్షకుపైగా ఆదాయం పొందుతున్నారు. నెలకు రూ.30 లక్షలు, ఏడాదికి రూ.3.60 కోట్లు ఇలా దందా కొనసాగుతోంది.
తుని కేంద్రంగా దందా
ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువులను తాండవ సుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని ప్రవేటు స్థలంలో దించి, అక్కడి నుంచి లారీల్లోకి ఎక్కించి పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం పెద్ద లారీలో 12 పశువులను ఎక్కించాలి. వీళ్లు మాత్రం 30 నుంచి 40 వరకు కుక్కుతున్నారు. అవరమైతే పశువుల కాళ్లు విరిచేస్తున్నారు. ఇదంతా రాత్రి 12 గంటల తర్వాత జరుగుతోంది. ఎవరైనా ప్రశ్నించినా మీకు సంబంధం ఏమిటని గర్జిస్తున్నారు. ఇంత జరుగతున్నా పోలీసులు అడపాదడపా కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు.
అక్రమంగా గోమాంసం తరలింపు..
వాహనం సీజ్, ఇద్దరిపై కేసు నమోదు
కొత్తపల్లి (పిఠాపురం): అక్రమంగా బీచ్ రోడ్డులో గోమాంసాన్ని తరలిస్తున్న ఐషర్ వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముం దస్తు సమాచారం మేరకు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ సిబ్బందితో బీచ్ రోడ్డులో వెళుతున్న వాహనాన్ని గుర్తించి పట్టుకున్నా రు. ఆయన కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి టాటా ఐషర్ ఏపీ31టీహెచ్4971 గల వ్యాన్‌లో పశు మాంసాన్ని ఉప్పాడ మీదుగా సామర్లకోటకు కాకినాడ బీచ్ రోడ్డులో తరలిస్తున్నారు. సుమారు మూడున్నర టన్నులు ఉన్న ఈ మాంసం విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉం టుంది. మాంసాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను సీజ్ చేసి మాంసాన్ని కొనుగోలు చేసిన అల్తాప్, డ్రైవర్ టి.జగ్గారావులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఉప్పాడ గ్రామ రెవె న్యూ అధికారి పర్యవేక్షణలో ఉప్పాడ బీచ్ రోడ్డులో పూడ్చివేసి ఎస్సై కేవీఎస్ సత్యనా రాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మాంసాన్ని కొత్తపల్లి పశువైద్యాధికారి రవిబాబు పరిశీలించారు. సుమారుగా 15 గేదెల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
ఉదయం 6.30 నుంచి 8.30 లోపు తరలింపు
ప్రతిరోజూ విజయనగరం, విశాఖపట్నం నుంచి ఉదయం 6.30 నుంచి 8.30 మధ్య అనేక వాహనాల్లో అక్రమంగా పశుమాంసాన్ని బీచ్ రోడ్డులో తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొంత మంది పోలీసు సిబ్బంది మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment