
పశువులను కబేళాలకు తరలిస్తున్న దృశ్యం
విశాఖపట్నం, చోడవరం: చోడవరం పరిసరాల్లో యథేచ్ఛగా పశువధ, కబేళాలు నిర్వహణ జరుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. చోడవరం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా పశువుల సంతలు ఉండడంతో కావలసిన పశువులను సులభంగా ఇక్కడకు తీసుకొస్తున్నారు. వడ్డాది, పీఎస్‌పేట, తిమిరాం, తుమ్మపాలల్లో పశువుల సంతలు భారీ స్థాయిలో జరుగుతాయి. ఆయా సంతల్లో ఒట్టిపోయిన, వయస్సు అయిపోయిన గేదెలను, లేకదూడలను కొనుగోలుచేసి ఇక్కడ వధిస్తున్నారు. ఇటీవల దీనిపై పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ పోలీసు యంత్రాంగం గాని, గో సంరక్షణ సమితి గాని అంతగా స్పందించక పోవడంతో పశువధకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చోడవరం శివారు శ్మశానవాటిక వద్ద ప్రత్యేకంగా ఓ ప్రదేశంలో నెలకు రెండు పర్యాయాలు గోవధ చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద సరంజామానే ఏర్పాటుచేశారు.
గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో పశువులను వధించి ఆ మాంసాన్ని ఐస్‌లో పెట్టి వ్యానుల్లో విశాఖపట్నం, విజయనగరంతోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిసింది. కొంతమంది ఒక యూనిట్‌గా ఏర్పడి ఈ అక్రమ మాంసం వ్యాపారం, పశువధ చేస్తున్నట్టు సమాచారం. గతంలో పోలీసులు దాడులు చేయడంతో మధ్యలో కొంత కాలం నిలిపివేయగా, మళ్లీ పశువులను వధిస్తూ మాంసం రవాణా ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకున్న పెందుర్తికి చెందిన శ్రీ సాయి గురుదత్త స్వామి ఆధ్వర్యంలో నిఘా ఉంచిన గో సంరక్షణ సమితి సభ్యులు సోమవారం అర్ధరాత్రి మాటువేసి గోవధ జరిగే ప్రదేశంపై దాడి చేశారు. అయితే ఆ సమయంలో నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో అక్కడ వధ చేయకుండా ఉన్న 10 లేగ దూడలను తీసుకొని వారు చోడవరం పోలీసులకు ఫిర్యాద చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారం ఎవరు చేస్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు. విశాఖపట్నం చెందిన కొందరు ఇక్కడ వాళ్లతో కలిసి ఈ వ్యవహారం చేస్తున్నారని తెలిసింది.
30 శాతం పశువులు కబేళాలకు
ఇదిలావుండగా జిల్లాలో ఏటా 30 శాతం పశువులు ఇలా కబేళాలకు తరలిపోతున్నాయి. ఎక్కుగా డెయిరీలు ఈ జిల్లాలోనే ఉండడంతో పాడి పశువుల పెంపకం కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఒట్టిపోయిన ఆవులు, గేదెలు, పెయ్యిలు గాని లేగ దూడలలు వల్ల రైతులకు కలిసి రాకపోవడంతో సంతల్లో వాటిని దళారులకు అమ్మేస్తున్నారు. వీటిని కొనుగోలుచేసిన దళారులు కబేళాలకు తరలించే వారికి అమ్మేస్తున్నారు. తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేసి, విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై పోలీసులు, గో సంరక్షణ సమితి సభ్యులు మరింత దృష్టిసారించాల్సి ఉంది. గో వధను నిలువరించాలని పలువురు కోరుతున్నారు. చోడవరంలో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment