
కాలినడకన తరలిస్తున్న పశువులు
సాక్షి, పార్వతీపురం (విజయనగరం): పశువుల తరలింపులో వ్యాపారుల పంథా మారింది. ఇదివరకు పార్వతీపురం మార్కెట్ యార్డు వద్ద వారపు సంతలో పశువులను కొనుగోలు చేసి బొలేరో వాహనాల్లో తరలించేవారు. అయితే ఇటీవల జోరుగా సాగుతున్న అక్రమ పశురవాణాను అరికట్టేందుకు పార్వతీపురం ఏఎస్సీ సుమిత్ గరుడ్ కళ్లెం వేశారు. మూగజీవాల చట్టం ప్రకారం ఒక బొలేరో వాహనంలో మూడు పశువుల కంటే ఎక్కువ ఎక్కించరాదంటూ స్పష్టం చేయడంతో పాటు దాడులు ముమ్మరం చేశారు. దీంతో అక్రమ పశువ్యాపారులకు ముకుతాడు వేసినట్లైంది. ఈ విధానం వ్యాపారులకు కలసి రాకపోవడంతో వారు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేసిస్తున్నారు. బొలేరో వాహనాల్లో పశువులను తరలిస్తుండటే పోలీసులు పట్టుకుంటున్నారు.
దీంతో అక్రమార్కులు తమ పంథా మార్చుకున్నారు. పార్వతీపురం మార్కెట్‌లో కొనుగోలు చేసిన పశువులను కాలినడకన బొబ్బిలి వరకు తరలించి అక్కడ లోడింగ్ చేసి పంపిస్తున్నారు. కొన్ని పశువుల మందలను అలమండ వరకు తరలించి అక్కడ లోడింగ్ చేస్తున్నారు. అయితే జాతీయ రహదారిపై పశువుల మందలను నడిపించడంతో వాహనచోదకులకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్డుకడ్డంగా గుంపులు గుంపులుగా పశువులు వెళ్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడిన సంఘటనలున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశులు అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.