
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గోవు
గోమాతకు హిందూ సమాజంలో ఉన్న ప్రాధాన్యమే వేరు. గోమాతకు దక్కే గౌరవం చెప్పలేనిది. అటువంటి గోమాతల తరలింపులో కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో మూగజీవాలు అష్టకష్టాలు పడుతున్నాయి. తరలింపులో నిబంధనలు పాటించాల్సిన వారు వాటిని పట్టించుకోవడం లేదు. చివరకు కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం, పార్వతీపురం: ప్రభుత్వం పాడి రైతులకు రాయితీపై మేలు జాతి పశువులను అందిస్తుంది. రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ మేలు జాతి పశువులను కొనుగోలు చేసి పాడి పశువుల పంపిణీ పథకం కింద రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పశువులను మన రాష్ట్రానికి తీసుకువస్తున్న సమయంలో మూగ జీవాల చట్టం పరిధిలోని నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఒకే లారీలో 20 వరకు ఆవులను ఎక్కించి వాటికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి లారీలో పశువులు చేరే సరికి మూడు రోజులు సమయం పడుతుంది. ఈ మూడు రోజుల పాటు లారీలో ఉన్న ఆవులకు ఆహారంగా పెట్టాల్సిన గడ్డిని కాని, దాణాను కాని, తాగునీటిని సమకూర్చకుండా వాటిని ఆకలితో మాడ్చేస్తున్నారు. ఈ కారణంగా మూగజీవాలు నరకం చూస్తున్నాయి. నిండు చూలుతో ఉన్న ఆ పశువులు తిండి తిప్పలు లేక కడుపులో పెరుగుతున్న దూడల ఆకలి తీర్చలేక కన్నీరు పెట్టుకుంటున్నాయి.
కడుపులోనే మృత్యువాత
మూడు రోజుల కిందట రాజస్థాన్ నుంచి బయలుదేరిన ఆవుల లారీ బుధవారం నాటికి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ లారీ ఒడిశా మీదుగా పార్వతీపురం చేరుకుని పార్వతీపురం మార్కెట్ యార్డుకు చేరుకుంది. లారీ డ్రైవర్లు ఆవులు పార్వతీపురం అనుకుని పార్వతీపురం మార్కెట్ యార్డులో దించేశారు. వారు ఆవులను కిందికి దించి లారీలో మత్తుగా నిద్రలోకి జారుకుంటున్నారు అయితే నిండు చూలాలతో ఉన్న ఆవుల్లో ఒక ఆవు కాన్పు సమయం కావడంతో ఒక దూడకు జన్మనిచ్చింది. మూడు రోజులుగా తిండి తిప్పలు లేకపోవడంతో కడుపులో దూడ మృతి చెందింది. ఇలా అనేక ఆవులు గర్భం దాల్చి ఉన్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. దూడకు జన్మనిచ్చిన ఆవుకు తీవ్ర గర్భస్రావం జరుగుతుంది. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మూగ జీవాలకు ఆహారం, తాగునీరు లేక దీనంగా కన్నీరు కారుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment