న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో జరిగిన మూకదాడి ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో 7రోజుల్లోగా నివేదిక అంద జేయాలని స్పష్టం చేసింది. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఆళ్వార్‌లో గత జూలై 20న రక్బార్ ఖాన్ అనే పాడిరైతుపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించాడు.
ఈ ఘటనకు సంబం ధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదలంటూ కోర్టు ధిక్కర ణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాలా దాఖలు చేశారు. ప్రభుత్వ సీఎస్, డీజీపీలతోపాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ ఘటనపై ఏమీ చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని రాజస్తాన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. మూకదాడులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం కొత్త చట్టం చేసే అంశానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అంగీకారాన్ని తెలుపుతూ సెప్టెంబర్ 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment