జైపూర్: ఎన్నికల ముందు ఉచితాలను ఆక్షేపిస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్రం, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును తప్పుడు దారిలో ఖర్చుచేస్తున్నారని పిటిషన్‌దారులు ఆరోపించారు.
ఉచితాల పేరుతో ఎన్నికల ముందు ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేస్తున్నారని ఆరోపిస్తూ భట్టులాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన డబ్బును ఉచితాల రూపంలో వృథాగా ఖర్చుచేయడకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని జైన్ కోరారు. ప్రజా శ్రేయస్సు పేరుతో ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఉచితాల కారణంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయని పిటిషన్‌దారుడు పేర్కొన్నారు. ఆ అప్పు ప్రభావం చివరికి పన్ను చెల్లింపుదారులపై పడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు డబ్బు పంచడం కన్నా నీచమైన నేరం ఉండదని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే రాజకీయ ప్రమాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని సీజేఐ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాలుగు వారాల గడువును ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment