సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి
అనంతగిరి: బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆవులు, లేగ దూడలను తరలించొద్దన్నారు. ఇతర పశువులను తీసుకెళ్లే వారు ఫిట్ ఫర్ స్లాటర్ పత్రాలు, పశువును తరలిస్తున్న వాహనాల పత్రాలు తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని తెలిపారు. వాహనంలో ఒక్కో పశువు మధ్య రెండు స్క్వేర్ మీటర్ల స్థలం ఉండాలన్నారు. వాహనాల్లో పరిమితికి మించి, ఎక్కువ సంఖ్యలో తరలించకూడదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే అక్రమ రవాణాగా పరిగణించి పశువులను గోశాలలకు తరలిస్తామని తెలిపారు.
పది చెక్ పోస్టులు
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పది చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పశువులు కలిగిన వాహనాలను అనధికారికంగా అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డీటీసీ అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా వెటర్నరీ అధికారి అనిల్ కుమార్ జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, వికారాబాద్, పరిగి, తాండూరు అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment