గో రక్షణకు హర్యానా సీఎం ముందడుగు
చండీగఢ్: బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యాక దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. యూపీ సీఎం యోగి కబేళాలు మూయించడం, గోవధను నిషేధించడంతో మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఆవులను రక్షించకుండా బయట వదిలేస్తే ఆ మూగజీవుల యజమానులు జరిమానా కట్టాల్సి ఉంటుందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిని ఇవ్వని ఆవుల విషయంలోనూ తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.
సోమవారం అన్ని జిల్లాల ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఖట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవులను గోశాలలు, పాకలలో కట్టివేయకుండా వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా నడుచుకునే వాటి యజమానులు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆవులను గోశాలలో ఉంచి వాటి ద్వారా ఎన్నో ఉత్పత్తి చేయవచ్చునని, ఉత్పత్పి ఆగిపోయినా తదితర మార్గాలు ఆన్వేషించాలని అధికారులకు సూచించారు. సహకార సంఘాల సహకారంతో గో ఉత్పత్తులు విక్రయించాలని చెప్పారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆవుల రక్షణకు పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని హర్యానా సీఎం ఆదేశించారు.