చండీగఢ్: హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయంతో క్రీడాకారులు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద‍్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అథ్లెట్లు ప్రొఫెషనల్ స్పోర్ట్స్, కమర్షియల్ ఎండార్స్‌మెంట్స్‌లలో పాల్గొనే సమయంలో సదరు నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో క్రీడాకారులకు అసాధారణ సెలవును (వేతనం ఇవ్వరు) ఇస్తారు. పోటీల ద్వారా సంపాదించిన మొత్తంలో మూడో వంతును హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తాం అని ఏప్రిల్ 30 న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
ఒకవేళ ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవుపై వెళ్లి ఈవెంట్ లేదా వాణిజ్య ప్రకటనల షూటింగ్‌లో పాల్గొంటే.. వాటి ద్వారా వచ్చే సంపాదన మొత్తాన్నీ క్రీడా మండలి దగ్గర డిపాజిట్ చేయాల్సిందేనని కొత్త నిబంధన కూడా విధించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. హర్యానా క్రీడాకారులు రెజ్లింగ్, బాక్సింగ్‌లలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment