
గో రక్షకుల దుర్మార్గం
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో గో రక్షకులు రెచ్చిపోయారు. గోవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన జల్పేగురి జిల్లాలోని ధూప్‌గురిలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను హఫీజుల్ షేక్(22), అన్వర్ హుస్సేన్(20)లుగా గుర్తించారు.
ఇద్దరు యువకులు అర్థరాత్రి గ్రామంలోకి వచ్చి ఏడు గోవులను వ్యాన్‌లో ఎక్కించుకుని వెళ్లబోయారని గ్రామస్థులు చెప్పినట్లు తెలిపారు. అర్థరాత్రి వ్యాన్ తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు దాన్ని అడ్డుకోగా.. అందులో గోవులు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. అనంతరం వ్యాన్‌లో ఉన్న ఇద్దరు యువకులను ఆవులను తరలిస్తున్న దొంగలుగా భావించిన గ్రామస్థులు వారిని రాళ్లతో కొట్టి చంపినట్లు వెల్లడించారు. అయితే, వ్యాన్ డ్రైవర్ మాత్రం గ్రామ ప్రజల చేతికి చిక్కకుండా పారిపోయినట్లు చెప్పారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. యువకులు దొంగాలా? లేక గోవులను ఏదైనా సంత నుంచి తీసుకెళ్తున్నారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సివుందని చెప్పారు.