గ్రామాలు ముంపులోకి.. గోవులు వనంలోకి | Thousands Of Cows And Bulls In The Backwater Forest Of Somasila | Sakshi
Sakshi News home page

గ్రామాలు ముంపులోకి.. గోవులు వనంలోకి

Published Fri, Sep 16 2022 11:26 AM | Last Updated on Fri, Sep 16 2022 11:47 AM

Thousands Of Cows And Bulls In The Backwater Forest Of Somasila - Sakshi

సహజంగా అటవీ ప్రాంతాల్లో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలు, దుప్పిలు, అడవిపందులు ఇలా రకరకాల జంతువులు ఎక్కువగా ఉంటాయి. కానీ సోమశిల వెనుక జలాలతో నిండిన అటవీ ప్రాంతంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో ఆవులు.. ఎద్దులు సంచరిస్తున్నాయి. నమ్మశక్యంగా లేదా.. అవును.. ఇది అక్షరాలా నిజం.. అంత భారీ సంఖ్యలో ఎలా ఉన్నాయని ఆశ్చర్యమేస్తోందా.. అయితే ఈ ఆసక్తికర సమాచారం మీకోసం.. 

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో వందకుపైగా గ్రామాలు సోమశిల వెనుక జలాలకు మునిగిపోయాయి. 1978 నుంచి సోమశిల జలాశయంలో నీటిని నింపేందుకు కడప జిల్లాలోని ముంపు గ్రామాలను గుర్తించి, వాటికి నష్టపరిహారం ఇప్పించి, ఖాళీ చేయించారు. 2007 నుంచి 70 టీఎంసీల నీరు నిల్వకు రంగం సిద్ధం చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేశారు.  నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నిర్మించారు. భూసేకణలో భాగంగా జిల్లాలోని వందకుపైగా గ్రామాలు నీట మునిగాయి. అప్పట్లో చాలామంది ముంపు బాధితులు గ్రామాలను వదిలి వెళ్లేటప్పుడు తమతోపాటు ఉన్న ఆవులు, ఎద్దులను అక్కడే వదిలి వెళ్లిపోయారు. విధిలేని పరిస్థితుల్లో అలా తమ పెంపుడు మూగజీవాలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.  

నాడు వందల్లో.. నేడు వేలల్లో 
సోమశిల ముంపు వాసులు 44 ఏళ్ల క్రితం తమ గ్రామాలను ఖాళీ చేసేటప్పుడు వదిలేసిన పశు సంపద అప్పట్లో వందల్లో ఉంటుంది. ఆ తర్వాత సంతానోత్పత్తి జరిగి వాటి సంఖ్య నేడు వేలల్లోకి చేరిందని అంచనా. ప్రస్తుతం సోమశిల అటవీ ప్రాంతానికి అలవాటు పడిన ఆవులు, ఎద్దులు వెనుక జలాలు తగ్గిన సమయంలో అప్పుడప్పుడూ గ్రామాల వైపు వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని కొందరు ఉచ్చు వేసి పట్టుకునేందుకు ప్రయతి్నస్తుంటారని అంటున్నారు. 

ఉచ్చులేసిపట్టుకున్నా..  
సోమశిల వెనుక జలాల అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న ఆవులు, ఎద్దులను పట్టుకోవాలంటే కష్టమే. కొంతమంది వీటితో వ్యాపారం చేసుకునేందుకు ఊచ్చులేసి పట్టుకుంటుంటారు. ఇటీవల ఉచ్చులేసి పట్టుకున్న ఆవులను పోలీసులు విడిపించి, మళ్లీ అడవిలోకి పంపించిన సంఘటన నందలూరులో చోటుచేసుకుంది.  

మునిగిపోయిన గ్రామాలు.. 
అట్లూరు మండలంలో మల్లెలపట్నం, చెండువాయి, రాఘవరెడ్డిపేట, చెర్లోపల్లె, ఒంటిమిట్ట మండలంలో గుండ్లమాడ, మాధవరం, ఉప్పరపల్లె, బోయనపల్లె, చిన్నపరెడ్డిపల్లె, కలికిరి, మదిలేగడ్డ, పొన్నపల్లె, మల్లంపేట, కొండమాచుపల్లె, కుడగుంటపల్లె, కొడుములూరు, నందలూరు మండలంలో యల్లంపేట, రంగాయపల్లె, తిమ్మరాచపల్లె, చుక్కాయపల్లె, చాపలవారిపల్లె, కొమ్మూరు, కోనాపురం, వెంకటరాజంపేట, చింతకాయలపల్లె, ఎగువరాచపల్లె, జంగాలపల్లెతో పాటు  ఉమ్మడి వైఎస్సార్‌  జిల్లాలో మరికొన్ని ఉన్నాయి.  

ముంపు గ్రామాలు పశుసంపదకు నిలయాలు 
సోమశిల ముంపు గ్రామాలు పశు సంపదకు నిలయాలుగా ఉండేవి. పచ్చటి పొలాలు, పాడిసంపదతో కళకళలాడేవి. సోమశిల జలాశయం కోసం అప్పటి ప్రభుత్వాలు పరిహారం ఇచ్చి జిల్లాలోని వందకుపైగా గ్రామాలను ఖాళీ చేయించాయి. ఆ సమయంలో చాలా వరకు పశుసంపదను వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 
    –భువనబోయిన లక్ష్మనయ్య, మాజీ ఎంపీపీ, నందలూరు 

అడవిలోకి ప్రవేశం నిషేధం 
సోమశిల వెనుక జలాలు గల అటవీ ప్రాంతం లో ప్రవేశం నిషేధం. అడవిలో ఉండే జీవాలు అడవికే పరిమితం. వాటిని అక్రమ రవాణా చే యడం చట్టరీత్యా నేరం. ముంపు గ్రామాలు ఖాళీ చేసినప్పుడు పశుసంపదను ఇక్కడే వది లేయ డంతో ఇప్పుడు ఆవులు, ఎద్దులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా అడవిలో ఉన్న వాటిని పట్టు కోవడం నేరమే.     
–కుందనూరి ప్రసాద్, రేంజర్, అటవీశాఖ, ఒంటిమిట్ట

సోమశిల ప్రాంతంలో ఆవులు, ఎద్దులు అనేకం 
సోమశిల వెనుక జలాల వెంబడి ఉన్న అడవుల్లో ఆవులు, ఎద్దులు వేల సంఖ్యలో ఉంటాయి. ముంపు గ్రామాలు ఖాళీ చేసిన క్రమంలో వాటిని వదిలి వెళ్లారు. అవే ఇప్పుడు అడవిలో ఉన్నాయి. ముంపు గ్రామాలు ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడాయి. పాడి అడవిపాలై, పంటలు నీటమునిగిపోయాయి. 
    –ఆశీర్వాదం, ముంపుబాధితుడు, కోనాపురం, నందలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement