
వ్యర్థాలను తినేందుకు వచ్చిన ఆవులు ఆవు కళేబరంలోని పొట్టలో కనిపిస్తున్న వ్యర్థాలు
వైఎస్‌ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు టౌన్ : కసువు తొట్ల వద్ద పడేస్తున్న బయో మెడికల్ వ్యర్థాలను తింటున్న మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి.పట్టణంలోని గాంధీరోడ్డు విజయనగర్‌వీధి, సూపర్‌బజార్‌రోడ్డు, హోమస్‌పేట తదితర వీధుల్లో రోడ్లపై కసువును డంప్ చేస్తున్నారు. సమీపంలో ఉంటున్న ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేక డబ్బాల్లో, కవర్లలో ఉంచకుండా నేరుగా చెత్తలో పడేస్తున్నారు. ఆహారం కోసం వీధుల్లో తిరుగుతున్న ఆవులు చెత్తను తినేందుకు వచ్చి బయోమెడికల్, ప్లాస్టిక్‌వ్యర్థాలను కూడా తినేస్తున్నాయి. దీంతో వీటి ఆరోగ్యం దెబ్బతింటోంది. ముక్కుల నుంచి పసుపుపచ్చటి ద్రవం కారుతూ ఆహారం తీసుకోక చివరకు మృత్యువాత పడుతున్నాయి.
పోస్టుమార్టంలో...
మృతి చెందిన ఆవులను కొన్నింటికి పశువైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. కడుపులో ఉన్న వ్యర్థాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లతోపాటు సెలైన్ ఎక్కించే పైపులు, సిరంజిలు, పగిలిన గాజు ముక్కలు ఇలా ఒక్కటేమిటి వివిధ రకాల వ్యర్థాలు బయట పడ్డాయి. మానవ తప్పిదం వల్ల మూగ జీవాల మనుగడకే ప్రమాదం ఏర్పడుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఆవులు ఎక్కడ పడితే అక్కడ మృతి చెందుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. ప్రధాన కాలువల్లోనూ బయోమెడికల్ వ్యర్థాలు పడేస్తుండటంతో నీరు విషతుల్యం అవుతోంది.మండల పరిధిలోని గ్రామాల్లో ఈ నీరు ప్రవహిస్తుండటంతో మేత కోసం వచ్చిన మూగ జీవాలు ఆ నీటిని తాగడంతో జబ్బుల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. రూ.వేలు పెట్టి కొనుగోలు చేసిన గేదెలు చనిపోతుండటంతో పాడి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా ఏ అధికారి పట్టించుకోవడం లేదు.
రోడ్లపై వదులుతున్న యజమానులపై చర్యలేవీ..
పాలు పిండు కొని ఆవులను రోడ్లపై వదిలేస్తున్న యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి వద్ద కట్టేసి ఆహారం పెట్టలేక రోడ్ల వెంట వదిలేస్తున్నారు. ఇవి వ్యర్థాలను తిని మృతి చెందుతున్నాయి. గతంలో దాదాపు 150కి పైగా ఆవులను దువ్వూరు మండలంలో ఉన్న గోశాలకు తరలించినా మరో 100 ఆవులు రోడ్ల వెంట తిరుగుతున్నాయి. రోడ్లపై ఉన్న చెత్త డంప్ పాయింట్లు తొలగించాల్సిన అవసరం ఉంది. ఇంటింటి కసువు సేకరణ 100 శాతం జరుగుతుందంటూ తూతూ మంత్రంగా నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నారే తప్ప అది అమలు చేయడం లేదు. ఈ చెత్తలోనే బయోమెడికల్ వ్యర్థాలు పడేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment