గోమాతా! నమోస్తుతే!
గోమాతా! నమోస్తుతే!
Published Thu, Aug 25 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
రత్నగిరిపై ఘనంగా గోపూజా మహోత్సవం
అన్నవరం :
కృష్ణాష్టమి సందర్భంగా గురువారం రత్నగిరిపై సత్యదేవుని ఆలయప్రాంగణంలో సామూహిక గోపూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల సమక్షంలో దేవస్థానంలోని రామాలయం ఎదురుగా గల ఆలయప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని గోవులను పూజించారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రామాలయం వద్ద గల కళావేదిక వద్దకు తీసుకువచ్చారు. పండితులు స్వామి, అమ్మవార్లకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం గోశాల, రత్నగిరి సప్తగోకులం నుంచి తెచ్చి 25 గోవులను పూజించారు. గోవులో లక్ష్మీ,గౌరీ,సరస్వతీ మాతలు కొలువై ఉంటారని, మూడుకోట్ల దేవతలు. చతుర్దశ పురాణాలు నిక్షిప్తమై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పంచామృతాల్లో గోక్షీరం, నెయ్యి, పెరుగు గోవు నుంచి వచ్చేవేనని, వీటితో బాటు గోమూత్రం, గోమయం విశేష ప్రాధాన్యత కల్గినవని తెలిపారు. యజ్ఞ, యాగాదుల్లో గోవు నుంచి వచ్చే ఈ ఐదింటిని తప్పక ఉపయోగిస్తారని తెలిపారు. గోధూళి సైతం పవిత్రమైనదని వివరించారు. వ్యవసాయంలో కూడా గోవుకున్న ప్రాధాన్యత గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారన్నారు. పండితులు గోవు శరీరంలోని ఏ భాగంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడో వివరిస్తూ గోవులకు ఈఓ నాగేశ్వరరావు దంపతులతో, భక్తులతో పూజలు చేయించారు. అనంతరం వేదపండితులు గోమాతలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. బియ్యం, బెల్లం, ఆవుపాలతో చేసిన క్షీరాన్నాన్ని తినిపించారు. తరువాత ఆ క్షీరాన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు.
నేడు రత్నగిరిపై సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజ
శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని నిత్యకల్యాణ మండపం, దాని పక్కనే గల వాయవ్య, నైరుతీ మండపాలలో సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ గురువారం విలేకర్లకు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి పూజలు ప్రారంభిస్తారని, 9 గంటలకే మహిళలు మండపాల వద్దకు చేరుకోవాలని సూచించారు. వచ్చిన వాళ్లందరితో పూజలు చేయిస్తారన్నారు. రెండు వేల మందికి పైగా పూజలాచరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాల్గొనే మహిళలు కొబ్బరికాయ, అరటిపళ్లు, రాగి లేదా ఇత్తడి చెంబు, పూలు, గాజులు తెచ్చుకోవాలని తెలిపారు. పూజకు అవసరమయ్యే పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, జాకెట్టుముక్క, అమ్మవారి రూపు, తోరం దేవస్థానం అందచేస్తుందని తెలిపారు. పూజలనంతరం మహిళలకు, వారితో వచ్చిన వారికి స్వామివారి దర్శనం, ఉచిత భోజనసౌకర్యం కల్పిస్తామని వివరించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షాలు కురవాలని కోరుతూ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ దేవస్థానంలో వరుణ జపాలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
Advertisement
Advertisement