రత్నగిరికి పోటెత్తిన భక్తులు
-
మూడు రోజుల్లో 50 వేలమంది రాక
-
దేవస్థానానికి రూ.40 లక్షల రాబడి
అన్నవరం :
సత్యదేవుని సన్నిధికి గత మూడు రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణంగా భాద్రపదమాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు కనుక భక్తులు పెద్దగా ఆలయానికి రారు. అయితే ఈసారి వరుసగా సెలవులు రావడం, దానికి తోడు ఆదివారం, సోమవారం దశమి, ఏకాదశి కలిసి రావడంతో స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో స్వామివారి ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు భక్తులతో నిండిపోయాయి. శని, ఆది, సోమవారాల్లో సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, దేవస్థానానికి సుమారు రూ.40 లక్షల ఆదాయం లభించింది. వ్రతాలు ఐదు వేలు నిర్వహించారు. ఈ మూడు రోజులూ తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి ఆలయానికి రావడం ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి రద్దీ పెరిగింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో భక్తులు రత్నగిరిపై ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది.