ఆవు లెటర్ రాయడం చూశారా!
ఐపూర్/జైసల్మీర్: విద్యాసంస్థలకు రాజకీయ రంగు తప్పడం లేదు. బీజేపీ హిందూత్వ భావజాల ప్రభావమో, వ్యక్తిగత ఉద్దేశమో.. మరేదైనా కారణమో.. మొత్తానికి రాజస్థాన్ లో తొలిసారి పాఠ్యంశాల్లో గోవు పేరిట ఓ లేఖను చేర్చి అలాంటి పాఠం పెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అందులో గోవు ఓ తల్లి మాదిరిగా విద్యార్థులకు లేఖ రాసినట్లు పాఠ్యాంశాన్ని చేర్చగా దానిపై పలువురు పెదవి విరుస్తున్నారు. బీజేపీ తన హిందూత్వ భావజాలాన్ని వసుంధరా రాజేతో జొప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఐదో తరగతి హిందీ పుస్తకాల్లో ఓ చాప్టర్ లో రెండు ఆవుల ఫొటోలను ముద్రించి.. గోవును తమ తల్లిగా పూజిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఇందులో ఆ గోవు సంభాషణ విద్యార్థులతో ఎలా ఉందంటే.. 'నా కుమారుల్లారా.. కూతుర్లార.. నేను ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తాను. తెలివిని ఇస్తాను. సుదీర్ఘ ఆయుష్షును ఇస్తాను. నా గొప్పతనాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారో వారు కచ్చితంగా మంచి అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు.
ఎవరు నన్ను తల్లిలాగా భావిస్తారో నేను వారిని నా బిడ్డలుగా భావిస్తాను. నేను పాలను, పెరుగును, నెయ్యిని ఇస్తాను. నా మలమూత్రములతో మెడిసిన్, ఫెర్టిలైజర్స్ తయారవుతాయి. నా సంతానమైన ఎద్దులు మీకు వ్యవసాయంలో సాయం చేస్తాయి. నా వల్ల వాతావరణం కూడా స్వచ్ఛంగా మారిపోతుంది' అంటూ లేఖ సాగింది. అయితే, గోవునుంచి పొందే లాభాలపై అవగాహన కల్పించేందుకే ఈ పాఠం పెట్టినట్లు మంత్రి ఓతారామ్ దేవాసి చెప్పారు.