నిర్లక్ష్యం... ‘ఆవు’లిస్తోంది... | cows dead | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం... ‘ఆవు’లిస్తోంది...

Published Fri, Jul 21 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

cows dead

  •  నెరవేరని దాతల ఆశయం
  •  మూగజీవాల పేరిట మోసం 
  •  నాడు కామధేను ట్రస్టు
  •  నేడు ఎస్‌పీసీఏ వంతు 
  •  హైకోర్టు జోక్యం చేసుకున్నా మారని స్థితి
  •  బక్కిచిక్కి చచ్చిపోతున్న పశువులు 
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    స్పందించే గుణం ఉంది. ఆదుకునే దాతలు ఉన్నారు. కానీ, నడిపే నిర్వాహకులకే చిత్తశుద్ధి కొరవడుతోంది. మూగజీవుల పేరిట మోసం చేస్తున్నారు. పోషణ చూడక పశువులు ఆకలి మంటలతో అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నాయి.  మరికొన్నిచోట్ల పశువులే మాయమైపోతున్నాయి. మొన్న గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారున గల సురభి కామధేను ట్రస్టు...నేడు కాకినాడ జంతు హింస నివారణ సంఘం...పశువుల పాలిట భక్షక కేంద్రాలయ్యాయి. 
    .
    నాలుగు రోజుల్లో 40 పశువుల మృతి...అదే ఎస్‌పీసీఏ ఘనత
    పిఠాపురం మహారాజా మూగజీవాలను సంరక్షణ కోసం 1906లో స్థానిక నాగమల్లితోట సమీపంలో పది ఎకరాలు భూమిని కేటాయించారు. ‘సొసైటీ ఫర్‌ ద ప్రివెంటివ్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్స్‌ ( ఎస్‌.పి.సి.ఎ.) సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ కమిటీకి చైర్మన్‌గా ఆయన వ్యవహరించేవారు. రోడ్లుపై తిరుగుతున్న మూగజీవాలను, అక్రమ రవాణా చేస్తున్న పశువులను చేరదీసి అలనాపాలనా చూసేవారు. అప్పట్లో సక్రమంగా నడిచిన ఈ సంస్థ... కమిటీ సభ్యులు నిర్వాకం కారణంగా క్రమేపీ ఆధ్వానంగా తయారయింది. కనీసం మూగజీవాలకు కడుపునిండా తిండిపెట్టి, వాటి సంరక్షణకు షెడ్లు కూడా వేయించలేని స్థితికి చేరుకుంది. అప్పట్లో సంస్థకు ఆదాయం లేకపోవడంతో 1944లో సెంట్రల్‌ డిఫెన్స్‌కు నాలుగు ఎకరాలు భూమిని అమ్మేశారు. 1975లో సంస్థ నిర్వహణ కోసం మరో 3.21 ఎకరాలను డీసీఎంఎస్‌కు విక్రయించారు. దాత విరాళంగా ఇచ్చిన పదెకరాలకు ప్రస్తుతం కేవలం 2.6 ఎకరాలు మాత్రమే జంతుహింస నివారణ సంఘానికి మిగిలింది.
    .
    వర్గపోరుతో సంఘానికి అవస్థలు 
    కమిటీ సభ్యులు చీలిపోయి రెండు వర్గాలుగా కావడంతో మూగజీవాలను పట్టించుకొనేనాధుడే కరువయ్యాడు. దీంతో ఆరేళ్ల క్రితం జంతు హింస నివారణ సంఘాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి ఆర్డీఓ సమక్షంలో నిర్వహణ బాధ్యతను పశు సంవర్థక శాఖ అధికారులు చూసుకునేవారు. కానీ ఆ తర్వాత సంస్థ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడం, జిల్లా అధికారులు సరైన ఆధారాలు కోర్టుకి సమర్పించకపోవడంతో జంతు హింస నివారణ సంస్థ బాధ్యతలు మళ్లీ కమిటీ చేతికందాయి. ఆ తర్వాత కమిటీలో కూడా విభేదాలు రావడం...తామంటే తామంటూ పంతాలకు పోయి రెండు వర్గాల్లో ఏ వర్గం కూడా పశువుల ఆలనపాలన పట్టించుకోవడం మానేశాయి. వాస్తవానికైతే ఆ సంస్థకు సంబంధించి పలు షాపులు ఉన్నాయి. వీటి ద్వారా అద్దెలొస్తున్నాయి. రికార్డుల్లో ఎంత చూపుతున్నారో తెలియదు గాని ఒక్కో షాపు నుంచి రూ.5 వేల వరకూ ఆదాయం వస్తుందన్న వాదనలున్నాయి. అందులో నిజమెంతో నిర్వాహకులే చెప్పాలి. 
    దాతల సాయం ఉన్నా...
      క్రమేపీ ఇక్కడ పశువులు సంఖ్య పెరగడం సంఘానికి నిధులు లేకపోవడంతో పశువులకు గడ్డికూడా వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వీటి ఆలనాపాలనా కూడా చూడడానికి మనుషులు నియమించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దాతలు సహకారంతోనే వీటికి గడ్డి అందజేసేవారు. ఎండాకాలంలో ఎండకు ఎండుతూ, వర్షాకాలం వానకు తడుస్తూ నరకయాతన పడుతున్నాయి. దీన్ని గుర్తించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మూగజీవాల కోసం షెడ్లును ఏర్పాటు చేశారు. కానీ షెడ్లును ప్రతిరోజూ పరిసరాలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లి ఆధ్వానంగా తయారైంది. జైన్‌ సంస్థ సభ్యులు నాగార్జున ఎరువుల కర్మాగారంలో పచ్చగడ్డిని వేలంలో పాడి అందిస్తున్నారు. మరో దాత వారానికి రెండుసార్లు రెండు బస్తాల తౌడు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ పశువులకు మేత అందలేదు. దీంతో గత నాలుగు రోజులుగా సుమారు 40 వరకూ పశువులు చనిపోయాయి. 
     
    మాయమైన సురభి కామధేను ట్రస్టు... 
     గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారున మూగజీవాల పోషణకు ఏర్పాటు సురభి కామధేను ట్రస్టు ఏకంగా మాయమయింది.   మల్లేపల్లిలో జాతీయ రహదారి పక్కన కూళ్ళ కృష్ణ అనే వ్యక్తి స్థలం, షెడ్లను అద్దెకు తీసుకుని సురభి కామధేను ట్రస్టు అక్టోబరు 5న రిజిస్టర్‌ చేయించారు. సోమాని సురేష్‌కుమార్‌ చైర్మన్‌గాను, గార్లంక రాంబాబు, దాసరి ప్రసాద్‌లు వైస్‌ చైర్మన్‌లు, కార్యదర్శిగా సుమన్‌చంద్ర విడితి, కోశాధికారిగా బావిశెట్టి ఉదయ్‌పుష్కరం పేర్లను ట్రస్టుకు కార్యవర్గంగా పేర్కొన్నారు. అక్టోబరు నుంచి ట్రస్టు వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులను ఉంచి వాటి ఆలనా పాలన చూశారు. ఈ క్రమంలో అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల్ని పోలీసులు ట్రస్టుకు అప్పగించేవారు. ఏలూరు, తణుకు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పశువులు సంఖ్య సుమారు వంద వరకు ఉండేవి. ట్రస్టు ఆశయం ప్రకారం పోషణ చేపట్టాల్సి ఉండగా ఆహారం, నీరు లేకుండా పస్తులుండే పరిస్థితులు దాపురించడంతో నిర్వాహకుల తీరును స్థానికంగా ఉన్న రైతులు తీవ్రంగా ఆక్షేపించారు. మేత, సౌకర్యం లేక పశువులు చనిపోయే పరిస్థితికి చేరుకోవడంతో మల్లేపల్లికి పురోహితులు చింతా అరుణ్‌కుమార్‌ శర్మ తదితరులు పశువులకు గ్రాసాన్ని అందించారు. ట్రస్టుకు తీసుకు వచ్చే పశువులను కబేళాకు తరలించేందుకే దీని నిర్వాహణ జరుగుతుందని అప్పట్లో చుట్టు పక్కల ప్రాంతాల ఆరోపణలు చేశారు. సురభి కామధేను ట్రస్టు నిర్వాహకులు దీని వెనుక పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపలు వినిపించాయి. ముఖ్యంగా ఆవులు, గేదెలను వేలాది రూపాయలు ధరలు పలకడంతో వాటిని దొడ్డిదారిన విక్రయించి సొమ్ములు చేసుకున్నారన్న వాదనలు వచ్చాయి. లక్షలాది రూపాయలు ఈ వ్యవహరంలో చేతులు మారగా పోలీసుల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు గుసగుసలు గుప్పుమన్నాయి. అక్టోబరు నుంచి పశువుల పోషణ ప్రారంభించిన ట్రస్టు నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా మార్చిలో తొలగించారు. దీనిపై టి.చంద్రశేఖర్‌ అనే వ్యక్తి  హైకోర్టులో సురభి కామధేను ట్రస్టుపై ప్రజావ్యాజ్యం వేశారు. దీంతో పోలీసులు మాత్రం పశువులను యజమానులకు అప్పగించారని కోర్టుకు నివేదించగా కలెక్టరు మాత్రం ట్రస్టు నిర్వహిస్తున్న వ్యక్తులు గాని, పశువులుగాని లేవని నివేదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ట్రస్టుకు అప్పగించిన పశువులు ఎక్కడకు పోయాయి, దీనిపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను విచారణకు ఆదేశించింది. ఏదేమైనప్పటికీ మూగ జీవాల మృత్యు ఘంటికలు మాత్రం ఆగడం లేదు. 
     
     
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement