సత్తాచాటిన మంగళగిరి ఎడ్లజత
-
ముగిసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
కారంపూడి: పల్నాటి వీరారాధనోత్సాల సందర్భంగా కారంపూడిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్ల పందేలు బుధవారం రాత్రి ముగిశాయి. పాల పళ్ల( (నాలుగుపళ్ల))విభాగం పోటీలను వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, నాయకులు డాక్టర్ గజ్జెల బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘం ప్రతినిధి బొమ్మిన అల్లయ్య, హనుమయ్యలను అభినందించారు. దాతలు పాతూరి రామిరెడ్డి, షేక్ షఫీ, కంపా శిర్రయ్య, కొంగర సుబ్రమణ్యం, మేకల శ్రీనివాసరెడ్డి, క్రిష్టపాటి అంకిరెడ్డి, బండ్ల వెంకటేశ్వర్లు(బుల్లోడు) చేతులమీదగా బహుమతులు అందించారు.
విజేతలు..
మంగళగిరికి చెందిన బత్తుల సరోజినీదేవి ఎడ్ల జత, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన జక్కుల రాజశేఖరయాదవ్, మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన తెనగాల అచ్చెయ్య కంబైన్డ్ జత 4,600 అడుగుల దూరం లాగాయి. ఈ రెండు జత్లకు ప్రథమ, ద్వితీయ బహుమతులను సమానంగా అందించారు. తృతీయ బహుమతి దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన తోట వీరబ్రహ్మనాయుడు జత, నాలుగో బహుమతి బొల్లాపల్లి మండలం హనుమాపురంతండాకు చెందిన కేతావత్ బద్యానాయక్ జత, ఐదో బహుమతి కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన వెనిగండ్ల విఘ్నేశ్వరి జత కైవసం చేసుకున్నాయి.