అంబా.. ఆకలి
-
నిధులు కరువు ... పర్యవేక్షణ బరువు
-
ఎండకు ఎండి... వానకు తడిసి...
-
బురదలోనే నిలబడి...
-
అనారోగ్యంతో కొన్ని, ఆకలితో మరికొన్ని మరణం
-
ఎండుగడ్డికీ ఎదురుచూపులే
-
సంరక్షణ కేంద్రంలో నరకం చవి చూస్తున్న గోవులు
గో రక్షణంటూ పెద్ద పెద్ద మాటలొద్దు ... గోమాతంటూ పూజలూ మాకొద్దు ... మాకున్న ఈ పెద్ద పొట్టలో సగమైనా ఎండిగడ్డి పడేస్తే అదే మాకు ‘పచ్చ’భక్ష్య పరమాన్నం’ అనుకుంటాం. ఒకరం కాదు ... ఇద్దరం కాదు ఏకంగా 400 మందిమి ‘అంబా’ అంటూ చేస్తున్న ఆర్తనాదం మిమ్మల్ని కదిలించడం లేదా...? అర్ధాకలితో అలమటిస్తూ తనువు చాలిస్తుంటే కనీస కనికరమైనా లేదా... ఏటా మంజూరయ్యే రూ.80 వేలు కూడా 2015 సంవత్సరం నుంచి ఆగిపోవడంతో మరిన్ని ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. పోషణ చేతకాకపోతే మమ్మల్ని వదిలేయండి ... రోడ్లపై పడి నోటికందింది తింటాం... రక్షణ పేరుతో జైలులో బంధించినట్టు బాధిస్తే ఎలా...
గాంధీనగర్, (కాకినాడ) :
అంబా... ఆకలంటూ ఆ ఆవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి... పట్టెడు ఎండుగడ్డి కోసం బారెడు పొట్ట తహతహలాడుతోంది. ఎంతో సదాశయంతో పెట్టిన గో రక్షణ శాలలోని ఆవులు ఆర్తనాదాలతో అల్లాడుతున్నాయి. కాకినాడలోని రమణయ్యపేట మార్కెట్ వద్ద ఉన్న గోశాల సంరక్షణ కేంద్రాన్ని ‘సాక్షి’ సందర్శించినప్పుడు దయనీయ పరిస్థితులు కనిపించాయి. వధశాలకు అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించి ఈ గోశాలలో పెట్టి ఆహారం, ఆరోగ్యం సంరక్షించడం గోశాల సంరక్షణ సంఘం బాధ్యత. ఈ కేంద్రంలో 400 వందలకుపైగా గోవులున్నాయి. ఈ 400 గోవుల్లో 200 పెయ్య దూడలున్నాయి. వీటికి కనీసం గడ్డి పరక కూడా వేయని పరిస్థితి నెలకొంది.
దయతో గూడిచ్చినా...
1906వ సంవత్సరంలో పిఠాపురం మహారాజా గారు జంతువులను హింసించడం, చంపడం వంటివి చేయకూడదనే ఉద్దేశ్యంతో జంతుహింస నివారణ సంఘాన్ని ఏర్పాటుచేసి, దానికి కావాల్సిన ఐదెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో గోశాల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా తరువాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సంరక్షణలో కూడా నిర్లక్ష్యం ఆవహించింది.
ఎండకు ఎండి ... వానకు తడుస్తూ...
గోవులను షెడ్లలో ఉంచకుండా ఆరుబయటనే కట్టేస్తున్నారు. ఎండకు మాడుతూ, వానకు తడుస్తూ దీనంగా బతుకునీడుస్తున్నాయి. దీనికితోడు తినడానికి గ్రాసం, తాగడానికి నీళ్ళు లేకపోవడంతో బక్కచిక్కిపోతున్నాయి. అధిక సంఖ్యలో అనారోగ్యాల బారిన పడుతున్నాయి. 400 వందలకుపైగా ఉన్న గోవుల్లో సుమారు 250 గోవులకు పైగా బక్కచిక్కిపోయాయి. ఇంకో 100 పైగా ఆవులు చనిపోయే స్థితిలో ఉన్నాయి. ఎక్కడనుంచో రక్షించి ఇక్కడకు తీసుకువచ్చి నరకం చూపిస్తున్నారని గో ప్రేమికులు వాపోతున్నారు.
ఆరోపణలెన్నో...
2008–2009 సంవత్సరంలో ఈ గోశాల సంరక్షణ సంఘం నిర్వహణపై పలు వివాదాలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పటి కలెక్టర్ ఈ కమిటీని రద్దు చేశారు. అయితే ఈ రద్దుపై హైకోర్టును ఆశ్రయించగా పాత కమిటీకే బాధ్యతలను అప్పగిస్తూ 2015 సెప్టెంబర్‌లో కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గోశాల సంరక్షణ సంఘం కమిటీ అధ్యక్షుడిగా దివంగత పిఠాపురం మహారాజా, ఉపాధ్యక్షుడిగా పి. రఘురామారావు, కార్యదర్శిగా గురుప్రసాద్, జాయింట్ సెక్రటరీగా గోపాల్, కోశాధికారిగా కృష్ణ గోపాల్, కౌన్సిల్ న్యాయశాఖ సలహాదారునిగా రవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ గోశాలను సంరక్షించడానికి 80,000 వేల రూపాయిలను అందించేది. 2005 వ సంవత్సరం నుంచి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం నిలిపివేయడంతో ఇక్కట్లు ప్రారంభమయ్యాయని కమిటీ సభ్యులు చెబుతున్నారు. దాతలెవరైనా అందజేసే గడ్డి, తవుడూ, కాయగూరలను ఆహారంగా ఇస్తున్నామని తెలిపారు.
అవన్నీ తప్పుడు ఆరోపణలు...
మేము మా గోశాల సంరక్షణ కేంద్రాలలోని గోవులకు ప్రతి పూటా ఆహారం, నీళ్లు ఇస్తున్నాం. మాపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలను మా కమిటీæ తీవ్రంగా ఖండిస్తుంది.
– గురు ప్రసాద్, గోశాల సంరక్షణ సెక్రటరీ, కాకినాడ
మాకెలాంటి సంబంధం లేదు
గోశాల సంరక్షణ భాద్యత పూర్తిగా ఈ కమిటీనే చూసుకుంటుంది. దీనిలో మేము ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. ఈ గోశాల భూ సంరక్షణ బాధ్యత గోశాల కమిటీ సభ్యులదే.
– పిల్లి. అనంతలక్ష్మి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే