
సాక్షి, కోల్‌కతా : సెల్ఫీలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదరకర దేశంగా మారిన భారత్‌లో ఈ మోజు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రమాదకర సెల్ఫీల చోట 'కౌసెల్ఫీ'లు వచ్చి పడుతున్నాయి. వేలాది కౌసెల్ఫీలు వచ్చి పడుతుండడంతో అందుకు పిలుపునిచ్చిన సంస్థ వెబ్‌సైటే క్రాష్ అయింది. కౌసెల్ఫీ అంటే మరేమో కాదు, ఆవులతో కలిసి ఫొటో దిగడమే. ఆవులను పరిరక్షించాల్సిన ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం కోసం పశ్చిమ బెంగాల్‌లోని 'గో సేవా పరివార్' సంస్థ కౌసెల్ఫీల పేరిట ఓ వినూత్న పోటీలకు తెర తీసింది.
గోకుల అష్టమి నాడు ప్రారంభమైన ఈ పోటీ డిసెంబర్ 31వ తేదీ వరకు నిర్వహిస్తోంది. పోటీల్లో నెగ్గిన సెల్ఫీలకు ఆకర్షణీయమైన అవార్డులు ఇస్తామని గో సేవా పరివార్ ప్రకటించింది. పోటీలో పాల్గొనేవారు ఆవులతో సెల్ఫీలు దిగి వాటిని 'గో సేవా పరివార్.ఆర్గ్'లో అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించింది. అందుకోసం ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో వందల్లో, వేలల్లో కౌసెల్ఫీలు వచ్చి పడడంతో సంస్థ వెబ్‌సైట్ క్రాష్ అయిందని, దాంతో అదనపు సర్వర్తను అరువు తీసుకొని పోటీ నిర్వహిస్తున్నామని గోసేవా పరివార్ సీనియర్ సభ్యుడు అభిషేక్ ప్రతాప్ తెలిపారు.
ఇప్పుడు కూడా రోజుకు 50 నుంచి 60 వరకు ఈ సెల్ఫీలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆవుల పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడంతోపాటు ప్రమాదరకరంగా మారిన సెల్ఫీల మోజును మంచి దారి పట్టించడం కోసం ఈ పోటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2014, మార్చి నుంచి 2016, సెప్టెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 127 మంది మరణించగా, ఒక్క భారత్‌లోనే 75 మంది మరణించారు. గో సేవా పరివార్ గత మూడేళ్లుగా బెంగాల్ రాష్ట్రంలో గోరక్షణాలయాలను నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పరివార్‌లో ఆరువేల మంది సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment