ఆ దంపతులు ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ అర్హతతో మెట్రో నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ఆనందమయమైన జీవితం గడుపుతూ వచ్చారు. అయితే వారి మదిలో ఓ వినూత్న ఆలోచన మెదిలింది. వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించి తాము కూడా వ్యవసాయంలో ఏదో ఒక విజయాన్ని సాధించాలని భావించారు. అనుకున్నదే తడవుగా తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి పల్లెబాట పట్టారు. పల్లెలో తమకున్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేస్తూ ఆదాయం ఆర్జించడమే గాక, అందరినీ అబ్బుర పరుస్తున్నారు. దాదాపు 30 ఆవులను సైతం పెంచుతూ ప్రకృతి వ్యవసాయంలో పరవశించిపోతున్నారు. భర్త చేస్తున్న వ్యవ‘సాయం’లో భార్య సైతం భాగస్వామి అవుతూ భర్తకు తోడునీడగా ఉంటోంది.
సాక్షి, రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గోపగుడిపల్లె పంచాయతీలోని నాగరాజుపల్లెకు చెందిన అశోక్‌రాజు, అపర్ణలు ఇంజినీరింగ్ పట్టభద్రులు. సుమారు పదేళ్లపాటు హైదరాబాదు, ఢిల్లీలోని పలు ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేశారు. అశోక్‌కు నెలకు రూ. 1.20 లక్షల వరకు వేతనం వచ్చేది. అపర్ణకు రూ. 60–70 వేల వరకు వచ్చేది. ఎప్పటినుంచో వ్యవసాయంపై మక్కువ ఉన్న వారు సెలవు రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలను వెళ్లి పరిశీలించేవారు. ఈ క్రమంలోనే అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేయాలన్న తలంపు వారిలో మొదలైంది. అనుకున్నదే తడవుగా ఉన్న ఉద్యోగాలను వదిలేసి సొంతూరి వైపు నడిచారు. అమ్మానాన్నల సమక్షంలో ఉన్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలను వేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. 30 ఆవులను పెంచుతున్నారు.
అరుదైన పంటల సాగు
ప్రస్తుతం అశోక్‌రాజు తనకున్న పొలంలో అరుదైన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలను ఎకరాలో సాగు చేశారు. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం ఉంటుందని భావించి మొక్కలను పెంచుతున్నారు. డ్రాగన్‌ఫ్రూట్స్ వంగడాలను థాయిలాండ్ (తైవాన్) నుంచి దిగుమతి చేసుకుని పొలంలో ఒక్కొక్క రాతి స్తంభానికి నాలుగు మొక్కలను నాటారు. తోటలో 350 రాతి స్తంభాలు అంటే 1500 డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. రూ. 8 లక్షల వరకు డ్రాగన్ ఫ్రూట్స్ మీదనే ఖర్చు చేశారు.
జూన్ నుంచి మొదలైతే డిసెంబరు వరకు ప్రతి 45 రోజులకు ఒక క్రాప్ వస్తూనే ఉంటుంది. కిలో రూ. 200 చొప్పున నెల్లూరు, హైదరాబాదు, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, కడప ఇలా ఆర్డర్ల మీదనే సరఫరా చేస్తున్నారు. ఎవరికి అవసరమైనా బాక్సులో భద్రపరిచి బస్సుల ద్వారా రవాణా చేస్తున్నారు. నీరు లేకున్నా.. చెట్లు తట్టుకుని నిలబడతాయి. ఎప్పటికీ పంట కాస్తూనే ఉండడంతో మంచి ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు 4–5 టన్నుల వరకు దిగుబడి వస్తుండగా, రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు టన్ను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ అంట్లు తయారు చేసి ఒక్కొక్క మొక్క రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క డ్రాగన్ ఫ్రూట్స్‌నే కాకుండా వరిలో కూడా వినూత్న వంగడాలు జీర సాబ, కుచిపటాలై, క్షేత్రాయ మహరాజ్, నవారు (షుగర్‌ను కంట్రోల్ చేసే వంగడంగా గుర్తింపు) లాంటివి సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంతోనే వేరుశనగ, మామిడి, నన్నారి సాగుకు కూడా శ్రీకారం చుట్టారు.
చెరకు వేసి.. బెల్లం తీసి..
అశోక్‌రాజు దంపతులు ప్రకృతి వ్యవసాయంతో చెరకు పంటను పండిస్తున్నారు. సుమారు రెండు ఎకరాల్లో చెరకు పండించి తర్వాత రెండు నెలలపాటు కటింగ్ చేస్తూ వస్తారు. ప్రతిరోజు తోట సమీపంలోనే ఇంటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గానుగ మిషన్ ద్వారా పాలు బయటికి తీసి పాకం పట్టి బెల్లం తయారు చేస్తున్నారు. రోజూ 200 కిలోలు చొప్పున తీస్తున్న బెల్లానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు తయారు చేసిన బెల్లంను నేరుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. వినూత్న పంటలతోపాటు వ్యవసాయంలోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌రాజు దంపతులు 2021లో రైతు నేస్తం అవార్డును అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు.
ఆనందంగా ఉంది
వ్యవసాయంలో చాలా సంతృప్తి ఉంది. అంతకంటే ఆరోగ్యం, ఆనందం కూడా ఉన్నాయి. అందుకే అందరి కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల పంటలను పండిస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా ఇప్పటికే లక్షల్లో ఆదాయం వచ్చింది. ఆర్డర్ల మీద వాటిని పంపిస్తుంటాము. అలాగే చెరకు ద్వారా బెల్లం కూడా తయారు చేస్తున్నాము. వరిలో కూడా అద్భుతమైన వంగడాలను తీసుకొచ్చి పండిస్తున్నాం. ఈసారి కొత్తగా నన్నారి సాగు కూడా మొదలెట్టాం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో కంటే ప్రకృతి మధ్య చేసే వ్యవసాయంలో ఉన్న ఆనందమే వేరు.
– ముప్పాళ్ల అశోక్‌రాజు, ప్రకృతి వ్యవసాయ రైతు, నాగరాజుపల్లె, రామాపురం మండలం
Comments
Please login to add a commentAdd a comment