రణన్నినాదం | YSRCP Samajika Sadhikara Bus Yatra in Rayachoti | Sakshi
Sakshi News home page

రణన్నినాదం

Published Fri, Dec 29 2023 3:17 AM | Last Updated on Fri, Dec 29 2023 3:17 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra in Rayachoti - Sakshi

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.  సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.  రింగ్‌రోడ్డు సర్కిల్‌ నుంచి శివాలయం వరకు మెయిన్‌రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మైనార్టీలకు ఎంతో మేలు      
మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియాఖాన్‌ చెప్పారు.   ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు.  దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. 

పేదల బతుకుల్లో  వెలుగులు           
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్‌ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. 

జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: 
రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్‌ చైర్మన్లుగా చేశారన్నారు.  డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. 

సంక్షేమ సారథి.. జగనన్న 
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్‌ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు.   అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement