జగన్నినాదాలతో హోరెత్తిన అరకు లోయ  | YSRCP Samajika Sadhikara Bus Yatra In Alluri Sitaramaraju District | Sakshi
Sakshi News home page

జగన్నినాదాలతో హోరెత్తిన అరకు లోయ 

Published Sat, Dec 30 2023 5:19 AM | Last Updated on Sat, Dec 30 2023 5:22 PM

YSRCP Samajika Sadhikara Bus Yatra In Alluri Sitaramaraju District - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ గొడ్డేటి మాధవి

సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): జగన్నినాదాలతో అరకు లోయ నియోజకవర్గం శుక్రవారం హోరెత్తిపోయింది. హుకుంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. గిరిజనం ప్రభంజనంలా తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. జై జగన్‌ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.

పాడేరు–హుకుంపేట రోడ్డులోని బర్మన్‌గుడ జంక్షన్‌ నుంచి సభావేదిక వరకు సుమారు వెయ్యి బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుని ఆయన రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన సంక్షేమ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగిందన్నారు. 

గడప గడపకు సంక్షేమ పథకాలు 
చంద్రబాబు ప్రభుత్వం అరకులోయ నియోజకవర్గ అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఎంతో అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. నవరత్న ప«థకాల ద్వారా నియోజకవర్గంలోని 2.41 లక్షల మందికి రూ.2 వేల కోట్ల వరకు లబ్ధి చేకూరిందని తెలిపారు.

అలాగే మారుమూల గ్రామాలతో పాటు అన్ని ప్రధాన గ్రామాలకు రోడ్లు, గెడ్డలపై వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలకు మరో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుపెడుతోందన్నారు. సెల్‌ టవర్ల నిర్మాణాలు, తాగునీటి పథకాలు, నాడు–నేడుతో పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ.వందలాది కోట్లు వ్యయం చేసిందన్నారు. 

జగన్‌ పాలనలోనే సామాజిక న్యాయం 
సీఎం జగన్‌ పాలనలోనే గిరిజనుల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కొనియాడారు. పాడేరు, పార్వతీపురంల్లో వైద్య కళాశాలలు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, కురుపాంలో ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణాల ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

చంద్రబాబు గిరిజనులను చిన్నచూపు చూశారని, రాజ్యాంగ పదవులకు దూరం చేశారని మండిపడ్డారు. గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోయారన్నారు. సామాజిక న్యాయం జగన్‌ పాలనలోనే సాధ్యమైందన్నారు. గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి తనతో సమానంగా చూశారని కొనియాడారు. తన పాలనలో 3.46 లక్షల ఎకరాల అటవీ భూములను గిరిజనులకు పంపిణీ చేశారన్నారు.  

ఆదివాసీలకు సామాజిక న్యాయం
ఆదివాసీలకు సీఎం జగన్‌ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర కొనియాడారు. ఇదే గిరిజన జాతికి చెందిన తనకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. అరకు నియోజకవర్గాన్ని రూ.ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి జగన్‌ అభివృద్ధి చేశారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అరకు నియోజకవర్గంలో గిరిజనుల సాగులో ఉన్న 49 వేల ఎకరాల అటవీ భూములకు పట్టాలిచ్చి  ఎంతో మేలు చేశారని తెలిపారు. చంద్రబాబు గిరిజనులను వాడుకుని వదిలేశారని మండిపడ్డారు.

అల్లూరి సీతారామరాజు మాదిరిగా గిరిజనులంతా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ సతక బుల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అరకు లోయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజా రమేశ్, ఎస్టీ కమిషన్‌ సభ్యులు కొర్రా రామలలక్ష్మి, జంపరంగి లిల్లీ, పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement