కర్నూలు జిల్లా పాణ్యం సామాజిక సాధికార సభలో సంఘీభావం తెలుపుతున్న నేతలు
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార పండుగ చేసుకొన్నారు. గురువారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వేనోళ్ల కీర్తిస్తూ వీధివీధిలో కలియదిరిగారు. డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వృత్తుల వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
మధాహ్నం అన్ని వర్గాల ప్రతినిధులతో కేఎస్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశం అనంతరం యాత్ర ప్రారంభమైంది. చెన్నమ్మ సర్కిల్ వరకు ర్యాలీ ఘనంగా జరిగింది. 500 బైక్‌లతో యువత ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారుల నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో పండుగ వాతావరణం కన్పించింది. మహిళలు, ప్రజాప్రతినిధులు కూడా నృత్యం చేసి సందడి చేశారు. సాయంత్రం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
బడుగుల గురించి ఆలోచించిన సీఎం ఒక్క జగన్ మాత్రమే: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
సభలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పేదల పిల్లలు కూడా సంపన్నుల పిల్లల మాదిరిగా అత్యున్నతస్థాయికి ఎదిగేలా అత్యాధునిక చదువులు చెప్పిస్తున్న దేవుడు సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఒకే వేదికపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూర్చోబెట్టి ఆ వర్గాలకు న్యాయం చేశామని ధైర్యంగా ప్రజలకు చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు.
75 ఏళ్లలో ఎవ్వరూ ఆలోచించని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థితికి చేర్చారని చెప్పారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకోవడానికి రామోజీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు చాలామంది ప్రయత్నిస్తున్నారని, అయినా, వెనుకాడేది లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని, బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదని చెప్పారు. సీఎం జగన్ అన్ని స్థానాలు, పదవుల్లో ఈ వర్గాలకే అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. పురందేశ్వరి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5కు చంద్రబాబు కావాలని, ప్రజలకు మాత్రం సీఎం జగన్‌మోహన్‌రెడ్డే కావాలని అన్నారు.
స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు: ఎంపీ గోరంట్ల
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాల్లో, అన్ని పదవుల్లో కనీసం 70 శాతం ఇచ్చి సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను సీఎం జగన్ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు ఆయన స్వార్ధం కోసం రాష్ట్రానికి, ప్రజలకు తీరని అన్యాయం చేశారని, ప్రత్యేక హోదాను మోదీకి అమ్మి ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకున్న దుర్మార్గుడని చెప్పారు. బాబు ప్రజలకు అందించిన స్కీములేవీ లేవని, స్కాములు మాత్రం లెక్కలేనన్ని చేశారని అన్నారు. ఆయన చేసిన తప్పులకు జీవితకాలం జైలులో ఉండాలన్నారు.
సీఎం జగన్ గొప్ప దార్శనికుడు: ఎంపీ గురుమూర్తి
సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికుడని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారని, సంక్షేమ పథకాలతో ప్రజల స్థితిగతులను ఉన్నతంగా మారుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నారాయణ, చైతన్య లాంటి ప్రైవేటు విద్యా సంస్థల అభ్యున్నతి కోసం పని చేస్తే.. వాటికి దీటుగా సీఎం జగన్ ప్రభుత్వ బడులను ఆధునీకరించి మంచి చదువు చెప్పిస్తున్నారని కొనియాడారు.
అభివృద్ధి లేదు అనే వారు పాణ్యానికి వచ్చి చూడాలి: ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి
పాణ్యంలో ఈ నాలుగున్నరేళ్లలో 1.60 లక్షల మందికి రూ.170 కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చెప్పారు. పిన్నాపురంలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్‌కో రెన్యువబుల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామన్నారు. గుట్టపాడు దగ్గర రూ.600 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటు కూడా పూర్తయిందన్నారు కర్నూలు సిటీలో అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, సుధాకర్, మేయర్ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment