
సాక్షి సాగుబడి డెస్క్: ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. ఈ రాష్ట్రాల్లో 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం ఉపయోగించి రసాయనరహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో 2,403 హెక్టార్లలో 2,002 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.
అత్యధికంగా 6,30,000 మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో (2.9 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా, గుజరాత్‌లో అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లకు (2.49 లక్షల మంది రైతులు) ప్రకృతి సేద్యం విస్తరించిందని ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్ పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన ఢిల్లీలోని కృషిభవన్‌లో ’జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం’సారథ్య సంఘం మొదటి సమావేశం శుక్రవారం జరిగింది.
తోమర్ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్ (http://nat uralfarminf.dac.gov.in/)ను ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ అభివృద్ధి చేసింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment