వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి తోమర్. పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగంలో ఏపీప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)పై మంగళవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్ శేఖర్‌బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఈ–క్రాప్ దేశంలోనే వినూత్నం: తోమర్
‘వ్యవసాయం బాగుండి రైతుల ఆదాయం పెరిగితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ దిశగా మీ (సీఎం జగన్) ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. వ్యవసాయ రంగంలో మీరు తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకం. ఏపీలో అమలు చేస్తున్న ఈ–క్రాప్ విధానం దేశంలోనే ఒక వినూత్న ప్రక్రియ. ఇది రైతులకు ఏ స్థాయిలో మేలు చేస్తుందో తెలుసుకుని ఆశ్చర్యపోయా. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ కార్యక్రమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా నిలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. విజయవంతంగా అమలవుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని దేశమంతా అమలు చేయడం అవసరం. వాటి ఫలాలను రైతులందరికీ అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. త్వరలోనే రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశాన్ని నిర్వహించి ఈ–క్రాప్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వినూత్న పథకాలు, కార్యక్రమాలను వివరిస్తాం. వాటిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటాం.
సీఎం జగన్ సూచనలను స్వీకరిస్తున్నాం..
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) రైతులకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లిన సమయంలో ఎంతో అండగా ఉంటుంది. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు అన్ని రాష్ట్రాలు చేరాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు వైదొలిగాయి.
లోటుపాట్లను అధిగమిస్తూ ముందుకెళ్తేనే రైతులకు మరింత మేలు జరుగుతుంది. ఏపీలో కేంద్ర బృందం పర్యటన సందర్భంగా సీఎం జగన్ చేసిన సూచనల మేరకు మార్పులు చేస్తున్నాం. ఈ–క్రాప్ వివరాలతో బీమా పథకాన్ని అనుసంధానిస్తాం. ఈ మేరకు మార్గదర్శకాలు సవరించాం. పీఎంఎఫ్‌బీవైలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సూచనలు కూడా స్వీకరిస్తాం.
చెరిసగం భరిస్తే మరింత మేలు: సీఎం జగన్
ఫసల్ బీమా యోజన పథకాన్ని అందరికీ వర్తింప చేయాలంటే విధానపరంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కేంద్రమంత్రితో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలున్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలతో కలిసి ఇవి పనిచేస్తున్నాయి. ఇక్కడ వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సంవర్ధక, మత్స్య అసిస్టెంట్లతో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలందిస్తున్నారు.
రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్ చేస్తున్నాం. ప్రతి పంటను బీమా పరిధిలోకి తెచ్చేలా అడ్డంకులను తొలగించాం. పటిష్ట వ్యవస్థ ద్వారా డేటా సేకరిస్తున్నాం. ఈ–క్రాప్ డేటా ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కట్టాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. మూడింట రెండొంతుల ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
పంటల బీమాలో యూనివర్సల్ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సన్న, చిన్నకారు రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. ఇందుకోసం ఈ–క్రాప్ డేటాను వినియోగించుకోవాలి. కొన్ని రాష్ట్రాలు ఫసల్ బీమా యోజనలో ఎందుకు లేవన్న అంశంపై దృష్టి సారించి సమస్యల పరిష్కారంతో పాటు మేం సూచించిన మార్పులు చేర్పులు చేసేందుకు ముందుకొచ్చిన కేంద్ర మంత్రి తోమర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment