సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) మహిళల పాత్ర అమోఘమని ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా నారాయణ్ కితాబిచ్చారు. గత రెండురోజులుగా అనంతపురంలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన ఆమె గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడారిలాంటి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా సాగవుతోందని చెప్పారు. కనీసం 20 సెంట్ల భూమిలో పేదలు కూరగాయలు పండించి అమ్ముకునేందుకు అమలు చేస్తున్న ఏటీఎం మోడల్ నిరుపేద రైతులను ఎంతో ఆదుకుంటోందని తెలిపారు. ఒక్కో రైతు నెలకు రూ.25 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఏర్పడటంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు.
దానిమ్మ,, బొప్పాయి, మునగ తదితర పంటలు బాగా సాగవుతున్నాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు ఎంతో సమర్థంగా పనిచేయడం విశేషమని పేర్కొన్నారు. సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తాను టీటీడీ ఈవోగా పనిచేసినప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే శనగలను టీటీడీ కొనుగోలు చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయమార్, సీఈవో బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment