ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం! | Permanent Solution to Fertilizers, Andhra Pradesh Shows The Way: Pantangi Rambabu | Sakshi
Sakshi News home page

ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!

Published Tue, Apr 19 2022 1:28 PM | Last Updated on Tue, Apr 19 2022 1:30 PM

Permanent Solution to Fertilizers, Andhra Pradesh Shows The Way: Pantangi Rambabu - Sakshi

యుద్ధం, కోవిడ్‌... విధ్వంసంతో పాటు సరికొత్త అవకాశాలనూ వెంట తెచ్చాయి. కోవిడ్‌ మహమ్మారి రోగ నిరోధక శక్తినిచ్చే ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తుల ఆవశ్యకతను జనబాహుళ్యం గుర్తెరిగేలా చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సృష్టిస్తున్న సంక్షోభం వల్ల భరించలేనంతగా పెరుగుతున్న రసాయనిక ఎరువుల ధరలు సేంద్రియ ప్రత్యామ్నాయాలకున్న ప్రాధాన్యాన్ని పెంచాయి. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తిపై మరింతగా దృష్టిని కేంద్రీకరించేలా పాలకులనూ, రైతులనూ పురికొల్పుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా పక్కన పెడితే పంట దిగుబడులు కుదేలై ఆహార భద్రతకు ముప్పు వస్తుందనే భయాందోళనలకు ఇప్పుడు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఏళ్లుగా అమల్లో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ అనుభవాలే ఇందుకు ప్రబల నిదర్శనాలు. 

ప్రకృతి వ్యవసాయ విస్తరణకు గ్రామస్థాయిలో మద్దతు వ్యవస్థలను నెలకొల్పటం ద్వారా నిర్మాణాత్మక కృషి చేస్తే... ప్రతి రైతునూ ప్రకృతి వ్యవసాయం వైపు దశలవారీగా మళ్లించటం... ఖర్చులు తగ్గించుకుంటూ సంతృప్తికరమైన దిగుబడులు సాధించడం సుసాధ్యమేనని ఆంధ్రప్రదేశ్‌ అనుభవాలపై థర్డ్‌ పార్టీ అధ్యయనాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. సుసంపన్నమైన ఈ అనుభవాలు మనకే కాదు ప్రపంచ దేశాలకూ గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలే చెబుతున్నాయి.  

అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి ఆర్నెల్లకూ రెట్టింపయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. రసాయనిక ఎరువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న రాయితీని కూడా తగ్గిస్తోంది. అంతిమంగా రైతుకు ఎరువులు మోయలేని భారంగా మారి పోతున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇప్పటికే తడిసి మోపెడైంది. 2020–21లో రూ. 1,27,921 కోట్లుండగా, 2021–22 నాటికి రూ. 1,40,122 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం ఇది ఇంకా పెరుగుతుంది. రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరగడమే కాదు, లభ్యత కూడా తగ్గిపోతున్నందున... అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు, రసాయనికేతర సుస్థిర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లటమే శాశ్వత పరిష్కారం. 

ఆంధ్రప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకృతి వ్యవసాయ విస్తరణ వల్లనే ఇది సాధ్యమవుతోంది. ప్రకృతి సేద్యం విస్తారంగా సాగులో ఉన్న కర్నూలు జిల్లాలో 2020–21తో పోలిస్తే 1,25,427 టన్నుల ఎరువుల వాడకం తగ్గింది. ఏపీలో 2020–21లో 42.26 లక్షల మెట్రిక్‌ టన్నుల రసాయనిక ఎరువుల వినియోగం జరిగింది. 2021–22 నాటికి ఇది 36.22 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గింది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం)

రసాయనాల విచ్చలవిడి వాడకం సహా అస్థిర వ్యవసాయ పద్ధతుల వల్ల భూమి ఉత్పాదక శక్తిని కోల్పోతున్నది. ఇప్పటికే 35% సాగు భూమి నిస్సారమై ఎడారిగా మారిపోయింది. 2045 నాటికి 13.5 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ వల్ల సొంత భూములను వదిలి పొట్ట చేతపట్టుకొని వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. (చదవండి: ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం)

వ్యవసాయం... ప్రకృతి వనరులపైన ఆధార పడిన జీవనోపాధి. అది ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రకృతి వనరులు, పర్యావరణం తిరిగి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన దేశంలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు. కాబట్టి, పర్యావరణంలో వస్తున్న మార్పుల్ని తట్టుకునే దిశగా వ్యవసాయం మారాల్సిన అవసరం వుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని దశల వారీగా విస్తరింపజేయడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో పెరిగే జనాభాకు సైతం ఆహార భద్రతన్విగలుగుతాం. 

– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement