
వ్యవసాయాన్ని అన్ని రకాలుగా సర్వ నాశనం చేసి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులను మోసం చేసి...
సాక్షి, నిడదవోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయడంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ప్రకృతి సేద్యంపై ప్రసంగించటానికి చంద్రబాబుకు ఐకరాజ్యసమితి ఆహ్వానంపై గొప్పలు చెబుతున్న టీడీపీకి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన పత్రికాప్రకటన విడుదల చేశారు. ప్రకృతి సేద్యానికి అంటే ఎరువులు, పురుగు మందులు వాడకుండా చేసే వ్యవసాయానికి చంద్రబాబు కృషి చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 2024 నాటికి రాష్ట్రంలో ఏకంగా 60లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తుందని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయం ఇక్కడి ప్రజలకు, రైతులకు తెలియదన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఐకరాజ్యసమితికి ఏం చెప్పిందో, ఏం చేసిందో గానీ.. చంద్రబాబు నాయుడును సేవలు చేస్తున్నారని భావించి సెప్టెంబర్ 24 ఐకరాజ్యసమితి న్యూయార్క్ కార్యాలయంలో ప్రసంగించాలని కోరారట అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వ్యవసాయాన్ని అన్ని రకాలుగా సర్వ నాశనం చేసి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులను మోసం చేసి, అప్పులపాలు చేసిన సీఎం.. పకృతి వ్యవసాయాన్ని బాగా చేయిస్తున్నట్టుగా అంతర్జాతీయంగా మేనేజ్ చేయడం రైతులు, రాష్ట్ర ప్రజలు గర్వపడాల్సిన విషయమా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మరికొన్ని ప్రశ్నలు కూడా సందించారు.
- నాలుగేళ్ల కాలంలో రైతుకు, వ్యవసాయానికి చంద్రబాబు చెయ్యని ద్రోహం ఉందా?
- వ్యవసాయానికి చంద్రబాబు చేసిన సేవలకు ఐకరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం ఇచ్చారా?
- రైతు వ్యతిరేక ముఖ్యంత్రికి వ్యవసాయానికి సంబంధించి అంతర్జాతీయ గౌరవాలు అందుకునే అర్హత ఉందా?