సాక్షి, అమరావతి: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఎప్పుడో రాజకీయ హాలిడే ఇచ్చారని, అటువంటి వారు క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని రెచ్చగొడితే, వారి మాటలను ఎవరు విశ్వసిస్తారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అగ్రికల్చర్ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అధికారంలో ఉంటే పసుపు పచ్చ కండువాలు, అధికారం పోయాక ఆకుపచ్చ కండువాలు వేసుకుని మోసంచేసే నేతలను ఎవరూ నమ్మరన్నారు.
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల్ని గుండెల్లో పెట్టుకుని చూసే వైఎస్సార్ వారసుడిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ, రైతు పక్షపాతిగా పరిపాలన చేస్తుంటే, అదిచూసి ఓర్వలేకే క్రాప్ హాలిడేల పేరుతో వారు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు.
ఆఖరికి రైతులను కూడా బాబు, పవన్‌లు స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదన్నారు. గత టీడీపీ పాలనలో ఇదే కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే, నిరంతరాయంగా సెక్షన్–30 అమలుచేసి, కేసులు పెడతామని రైతు సంఘాల నేతలను బెదిరించి, రైతులను అణచివేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు.
అదే ఈ ప్రభుత్వంలో అక్కడి రైతులకు ఏమైనా సమస్యలుంటే, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తే ఆయన పరిష్కరిస్తున్నారని నాగిరెడ్డి తెలిపారు. కానీ, 2014–19 మధ్య చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు.
రైతులకిచ్చిన హామీలన్నీ గాలికి..
అప్పట్లో బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన పుస్తెలను ఇంటికే తెచ్చిస్తానని.. పగటిపూటే తొమ్మది గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తానని.. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని.. మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేస్తానని చంద్రబాబు చెప్పారని నాగిరెడ్డి వివరించారు.
అలాగే, సాగునీటి ప్రాజెక్టులు వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు–నగరి పోలవరం సహా అన్నింటినీ 2018 నాటికి పూర్తిచేసి, రాయలసీమకు నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తానన్నారని.. అంతేకాక, రెయిన్ గన్లతో కరువును జయించానని.. తుపానులను, సముద్రాన్ని నియంత్రించి నీటిని పారిస్తానని కూడా చెప్పారని నాగిరెడ్డి గుర్తుచేశారు.
ఇక రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, రకరకాల కోతలతో ఆ మొత్తాన్ని రూ.24 వేల కోట్లకు పరిమితం చేశారని, చివరికి అందులోనూ కోతవేశారని ఎద్దేవా చేశారు. ఆఖరి రెండు ప్రీమియంలను రైతులకు అసలు చెల్లించలేదని నాగిరెడ్డి మండిపడ్డారు.
బాబును పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా?
2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చి ఆయన అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేయని బాబును పవన్ ఏనాడైనా అడిగారా అని నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టాక, 14 నెలలపాటు కోవిడ్ సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా, రైతులను అన్నివిధాలా ఆదుకున్నారని.. ప్రజలకు మంచి చేయటానికి కావాల్సింది అనుభవం ఒక్కటే కాదని.. చిత్తశుద్ధని అన్నారు.
ఇది సీఎం జగన్ నిరూపించారని ఆయన చెప్పారు. చెప్పిన దానికంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్ రైతులకు ఎంతో చేస్తున్నారంటూ ఆయా కార్యక్రమాల వివరాలను నాగిరెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment