
సాక్షి, అమరావతి: రైతు పేరెత్తే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. వ్యవసాయం దండగ అంటూ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిలువునా ముంచేసి ఇప్పుడు రైతుల కోసం అంటూ కపటప్రేమ చూపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014లో ఎన్నికల ముందు బేషరతుగా రుణమాఫీ చేస్తానని నమ్మించి రైతులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం వంటి వివిధ రకాల హామీలను ఇచ్చిన చంద్రబాబు.. వాటిలో ఒక్కటైనా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల మూలంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ రైతులు, పేదలు సహా వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పారు. కోవిడ్ సంక్షోభం కారణంగా దేశంలో సంపన్నమైన మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రైతులకు రూ.83 వేల కోట్ల లబ్ధి చేకూర్చారని, పోలవరంతో సహా ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారని చెప్పారు.
ఉచిత విద్యుత్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గత ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.17,030 కోట్లు అన్నదాతలకు ఇచ్చిందన్నారు. 18.7 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 9గంటల పగటి ఉచిత విద్యుత్‌కోసం రూ.8,353 కోట్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఆధునికీకరణకు రూ.1,700 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ డిస్కమ్‌లకు రూ.20 వేల కోట్ల బకాయి ఉండగా ఇందులో రూ.8,750 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలేన న్నారు.
Comments
Please login to add a commentAdd a comment