![MVS Nagireddy Comments On Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/16/mvs.jpg.webp?itok=bMiazEdu)
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ‘రైతు కోసం...’ అని పిలుపునివ్వడం ఈ శతాబ్ధంలోనే అతి పెద్ద జోక్ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. 14 ఏళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. ఆయన పదవి నుంచి దిగిపోయేనాటికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, వరుసగా ఐదేళ్లూ కరువు మండలాలను ప్రకటించడమే ఆ నిర్వాకాలకు నిదర్శనమన్నారు.
ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, నష్టపరిహారం ఇవ్వాలని నాడు దివంగత వైఎస్సార్ కోరితే దానివల్ల మరింత మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చంద్రబాబు అవహేళనగా మాట్లాడారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్సార్ ప్రకటించినప్పుడు కూడా చంద్రబాబు చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
రైతు కోసం.. ఏం చేశావ్ బాబూ?
రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క కరువు మండలం కూడా లేనందుకు, రైతులు బాగున్నందుకు చంద్రబాబు రోడ్డెక్కుతున్నారా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. 2014లో రాష్ట్రంలో 238 కరువు మండలాలు ఉన్నట్లు గత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఆ తరువాత కూడా వరుసగా నాలుగేళ్లు కరువు మండలాలను ప్రకటించారని గుర్తు చేశారు.
సాగునీటి ప్రాజెక్టులు దండగని, పావలా వడ్డీ కూడా రాదని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు అధికారంలో కొనసాగి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. దేవెగౌడను తానే ప్రధానిగా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా నిర్లిప్తంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment