సతీమణి పద్మావతితో శంకర్
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొందరు రైతులు మంచి ఆదాయాన్ని గడించలేకపోతున్నారు. రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకంగా పండించిన పంట దిగుబడులను సైతం సాధారణ మార్కెట్లో మామూలు ధరకే అమ్మేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం ‘దళారుల్లేని సొంత మార్కెటింగే’ అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. మూడేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన శంకర్.. ప్రణాళికతో ముందడుగు వేస్తూ బాలారిష్టాలను అధిగమించి.. సత్ఫలితాలను అందుకుంటున్నారు. తన పంట దిగుబడులను తానే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటంతో పాటు ఇతర రైతుల ఉత్పత్తులను సైతం అమ్మిపెడుతున్నారు. యువరైతుగా శంకర్ సక్సెస్‌ను చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి ఆయనను పెళ్లాడి, వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు.
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు శ్రమపడి ఎంత మంచి దిగుబడి సాధించినా రసాయనిక వ్యవసాయం చేస్తున్న చాలా మంది రైతుల్లాగా గంపగుత్తగా దళారులకు అమ్మేస్తే తగినంత ఆదాయం పొందటం అసాధ్యం అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. విశాఖపట్నం దగ్గరలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శంకర్ వైజాగ్‌లో బీఈ చదివి, హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఆరున్నరేళ్లు అసిస్టెంట్ సిస్టమ్స్ ఇంజినీర్‌గా పని చేశారు. సుభాష్ పాలేకర్, కర్రి రాంబాబు తదితరుల స్ఫూర్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2017లో ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. రెల్లి గ్రామంలో ఆరెకరాల సొంత భూమితో పాటు, భోగాపురం మండలం బసవపాలెంలో మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకొని అనేక పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.
గోవులతో లింగాల శంకర్
వ్యాన్ ద్వారా విక్రయాలు
రైతుమిత్ర పరస్పర సహకార సంఘంలో శంకర్ క్రియాశీల సభ్యుడు. తన 36 ఎకరాల్లో పండించిన పంటలతోపాటు సొసైటీలోని 89 మంది ప్రకృతి వ్యవసాయదారులు పండించిన పంటలను సైతం మార్కెట్ చేయటంలో శంకర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిలో 23 మంది కూరగాయలు, పండ్లు పండించే రైతులు. మిగతా వారు ధాన్యం, పప్పులు పండించేవారు. వీరంతా విశాఖకు దగ్గరలోని భోగాపురం, కొత్తవలస మండలాల్లోని రైతులే. వీరెవరూ సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోలేదు.
వీరి నుంచి సేకరించిన కూరగాయలు, పప్పులు, బియ్యం తదితరాలను విశాఖపట్నం నగరంలో విక్రయిస్తున్నారు. ఒక్కచోట దుకాణం పెట్టేకన్నా రోజుకో చోట అమ్మకాలు చేపట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావించారు. శంకర్ మరో 8 మంది రైతులు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ఒక వ్యాన్‌ను కొనుగోలు చేశారు. ఈ మొబైల్ ఆర్గానిక్ స్టోర్ ద్వారా వారంలో 4 రోజుల పాటు విశాఖలో రోజుకో చోట (ఉ. 6.30 –10 గం. వరకు) తాము పండించిన, సేకరించిన 218 ప్రకృతి ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నారు. తమకు 300 మంది నమ్మకమైన వినియోగదారులు ఉన్నారని శంకర్ తెలిపారు. వీలున్నప్పుడు తమ పొలాలకు వచ్చిపోతూ ఉండటంతో వీరికి నమ్మకం కలిగిందన్నారు. తమ రైతులపై ఉన్న నమ్మకమే సర్టిపికెట్ మాదిరిగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
విశాఖపట్నంలో ప్రకృతి వ్యవసాయోత్పత్తులు విక్రయిస్తున్న రైతుమిత్ర వ్యాన్
రైతుబజార్ ధర కన్నా 25% అధిక ధర
రైతుబజార్‌లో సాధారణ కూరగాయలు, పండ్లను ఆ రోజు విక్రయించే చిల్లర గరిష్ట ధరకు 25% అదనంగా చేర్చిన ధరను ప్రకృతి రైతుల ఉత్పత్తులకు తాము ధర చెల్లిస్తున్నామని శంకర్ తెలిపారు. కూరగాయలు, పండ్లకు ఏడాది పొడవునా ఒకే ధర ఇవ్వటం కన్నా ఈ పద్ధతే రైతులకు, తమకూ బాగుందన్నారు.
ప్రకృతి వ్యవసాయదారులకు రసాయన వ్యవసాయదారులతో పోల్చితే సాగు ఖర్చులు సగానికి సగం తక్కువ. ఏక పంటలుసాగు చేసే రసాయనిక వ్యవసాయదారుల కన్నా.. సొంత విత్తనాలతో బహుళ పంటలు సాగు చేసి నేరుగా వినియోగదారులకు అమ్మే ప్రకృతి రైతులకు నికరాదాయం ఎక్కువగా వస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎంత దిగుబడి తీసినా ఎవరి మార్కెటింగ్ వాళ్లే (సంఘంగా గాని లేదా వ్యక్తిగతంగా గాని) చేసుకుంటేనే నికరాదాయం పెరిగి ఆర్థికంగా కూడా సక్సెస్ కాగలుగుతారని శంకర్ స్వానుభవంతో చెబుతున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలిపెట్టి మట్టిలో కాలుపెట్టి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన యువరైతుగా శంకర్ తాను సక్సెస్ కావటమే కాదు తోటి రైతులనూ వెలుగుబాటలో నడిపిస్తున్నారు. ఇది చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి, గత ఏడాది ఆయనను పెళ్లాడారు. తనూ సంతోషంగా ప్రకృతి వ్యవసాయంలో పాలుపంచుకుంటున్నారు!
ఇన్‌పుట్స్ : విన్నుకొండ గౌతమ్,
సాక్షి, కొత్తవలస రూరల్, విజయనగరం జిల్లా
ఏడాదిలో ప్రకృతి సేద్యంపై పట్టు
పూర్తి కాలం వెచ్చించి ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధగా దృష్టి పెట్టిన శంకర్ ఏడాదిలోనే సాగు మెలకువలను వంట పట్టించుకోగలిగారు. ఏకదళ, ద్విదళ పంటలను పక్కపక్కనే సాగు చేయటం, కచ్చితంగా పంటల మార్పిడి పాటించటం, పశువుల ఎరువులో జీవన ఎరువులు కలిపి మాగబెట్టి పొలానికి వెయ్యటం, డ్రిప్ ద్వారా 8 రోజులకోసారి జీవామృతాన్ని పారించటం, కాలానుగుణంగా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వివిధ రకాల కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పప్పుధాన్య పంటల ప్రణాళికను రూపొందించుకొని అనుసరించటం ద్వారా మంచి దిగుబడులను రాబట్టుకోగలుగుతున్నారు. శంకర్ ఆరు ఒంగోలు ఆవులను పోషిస్తున్నారు.
పంటలకు తగినంత పోషకాలను అందించే క్రమంలో చేపల మార్కెట్ నుంచి వ్యర్థాలను సేకరించి అమినో ఆమ్లం తయారు చేసి వాడుతున్నారు శంకర్. వంగ సాగులో రెండేళ్ల పాటు పుచ్చుల సమస్యను ఎదుర్కొన్నారు. కాయ తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను అరికట్టడానికి సీవీఆర్ మట్టి పిచికారీ పద్ధతి బాగా ఉపకరించిందని శంకర్ తెలిపారు. గతంలో 60–70% వంకాయల్లో పుచ్చులు వచ్చేవని మట్టి ద్రావణం వల్ల ఇది 10%కి తగ్గిందన్నారు. అయితే, పెసరలో ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులును అదుపు చెయ్యటం ఇంకా సమస్యగానే ఉందన్నారు. 400 నాటు కోళ్లు పెంచుతున్నారు. సజ్జలు, వడ్లతో కూడిన మేతను వేస్తూ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు.
గౌరవం.. ఆర్థిక స్థిరత్వం..
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి మూడేళ్లు దాటింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కన్నా ప్రకృతి వ్యవసాయదారుడిగా రెట్టింపు గౌరవం పొందుతున్నా. పండించిన ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారుడికి అమ్మితేనే మంచి ఆదాయం వస్తుంది. మొదటి ఏడాది సాగులో, మార్కెటింగ్‌లో కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. ఇప్పుడు స్థిమితత్వం వచ్చింది. ఆదాయంతో పాటు సమాజంలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంది.
– లింగాల శంకర్
(92933 34477),
రెల్లి ,కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment