Farmers Bazar
-
రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు: కన్నబాబు
సాక్షి, అమరావతి: రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రూ.1584 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలిదశలో రూ.659 కోట్లతో 1255 బహుళ ప్రాయోజిత కేంద్రాలను, రెండో దశలో రూ.925 కోట్లతో 1276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నవంబర్ నాటికి తొలిదశ నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కొత్తగా మరో 25 రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. చదవండి: రికార్డు స్థాయిలో వాక్సినేషన్ చేస్తున్నాం: ఆళ్ల నాని -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొందరు రైతులు మంచి ఆదాయాన్ని గడించలేకపోతున్నారు. రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకంగా పండించిన పంట దిగుబడులను సైతం సాధారణ మార్కెట్లో మామూలు ధరకే అమ్మేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం ‘దళారుల్లేని సొంత మార్కెటింగే’ అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. మూడేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన శంకర్.. ప్రణాళికతో ముందడుగు వేస్తూ బాలారిష్టాలను అధిగమించి.. సత్ఫలితాలను అందుకుంటున్నారు. తన పంట దిగుబడులను తానే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటంతో పాటు ఇతర రైతుల ఉత్పత్తులను సైతం అమ్మిపెడుతున్నారు. యువరైతుగా శంకర్ సక్సెస్‌ను చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి ఆయనను పెళ్లాడి, వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు శ్రమపడి ఎంత మంచి దిగుబడి సాధించినా రసాయనిక వ్యవసాయం చేస్తున్న చాలా మంది రైతుల్లాగా గంపగుత్తగా దళారులకు అమ్మేస్తే తగినంత ఆదాయం పొందటం అసాధ్యం అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. విశాఖపట్నం దగ్గరలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శంకర్ వైజాగ్‌లో బీఈ చదివి, హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఆరున్నరేళ్లు అసిస్టెంట్ సిస్టమ్స్ ఇంజినీర్‌గా పని చేశారు. సుభాష్ పాలేకర్, కర్రి రాంబాబు తదితరుల స్ఫూర్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2017లో ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. రెల్లి గ్రామంలో ఆరెకరాల సొంత భూమితో పాటు, భోగాపురం మండలం బసవపాలెంలో మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకొని అనేక పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గోవులతో లింగాల శంకర్ వ్యాన్ ద్వారా విక్రయాలు రైతుమిత్ర పరస్పర సహకార సంఘంలో శంకర్ క్రియాశీల సభ్యుడు. తన 36 ఎకరాల్లో పండించిన పంటలతోపాటు సొసైటీలోని 89 మంది ప్రకృతి వ్యవసాయదారులు పండించిన పంటలను సైతం మార్కెట్ చేయటంలో శంకర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిలో 23 మంది కూరగాయలు, పండ్లు పండించే రైతులు. మిగతా వారు ధాన్యం, పప్పులు పండించేవారు. వీరంతా విశాఖకు దగ్గరలోని భోగాపురం, కొత్తవలస మండలాల్లోని రైతులే. వీరెవరూ సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోలేదు. వీరి నుంచి సేకరించిన కూరగాయలు, పప్పులు, బియ్యం తదితరాలను విశాఖపట్నం నగరంలో విక్రయిస్తున్నారు. ఒక్కచోట దుకాణం పెట్టేకన్నా రోజుకో చోట అమ్మకాలు చేపట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావించారు. శంకర్ మరో 8 మంది రైతులు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ఒక వ్యాన్‌ను కొనుగోలు చేశారు. ఈ మొబైల్ ఆర్గానిక్ స్టోర్ ద్వారా వారంలో 4 రోజుల పాటు విశాఖలో రోజుకో చోట (ఉ. 6.30 –10 గం. వరకు) తాము పండించిన, సేకరించిన 218 ప్రకృతి ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నారు. తమకు 300 మంది నమ్మకమైన వినియోగదారులు ఉన్నారని శంకర్ తెలిపారు. వీలున్నప్పుడు తమ పొలాలకు వచ్చిపోతూ ఉండటంతో వీరికి నమ్మకం కలిగిందన్నారు. తమ రైతులపై ఉన్న నమ్మకమే సర్టిపికెట్ మాదిరిగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ప్రకృతి వ్యవసాయోత్పత్తులు విక్రయిస్తున్న రైతుమిత్ర వ్యాన్ రైతుబజార్ ధర కన్నా 25% అధిక ధర రైతుబజార్లో సాధారణ కూరగాయలు, పండ్లను ఆ రోజు విక్రయించే చిల్లర గరిష్ట ధరకు 25% అదనంగా చేర్చిన ధరను ప్రకృతి రైతుల ఉత్పత్తులకు తాము ధర చెల్లిస్తున్నామని శంకర్ తెలిపారు. కూరగాయలు, పండ్లకు ఏడాది పొడవునా ఒకే ధర ఇవ్వటం కన్నా ఈ పద్ధతే రైతులకు, తమకూ బాగుందన్నారు. ప్రకృతి వ్యవసాయదారులకు రసాయన వ్యవసాయదారులతో పోల్చితే సాగు ఖర్చులు సగానికి సగం తక్కువ. ఏక పంటలుసాగు చేసే రసాయనిక వ్యవసాయదారుల కన్నా.. సొంత విత్తనాలతో బహుళ పంటలు సాగు చేసి నేరుగా వినియోగదారులకు అమ్మే ప్రకృతి రైతులకు నికరాదాయం ఎక్కువగా వస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎంత దిగుబడి తీసినా ఎవరి మార్కెటింగ్ వాళ్లే (సంఘంగా గాని లేదా వ్యక్తిగతంగా గాని) చేసుకుంటేనే నికరాదాయం పెరిగి ఆర్థికంగా కూడా సక్సెస్ కాగలుగుతారని శంకర్ స్వానుభవంతో చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి మట్టిలో కాలుపెట్టి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన యువరైతుగా శంకర్ తాను సక్సెస్ కావటమే కాదు తోటి రైతులనూ వెలుగుబాటలో నడిపిస్తున్నారు. ఇది చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి, గత ఏడాది ఆయనను పెళ్లాడారు. తనూ సంతోషంగా ప్రకృతి వ్యవసాయంలో పాలుపంచుకుంటున్నారు! ఇన్పుట్స్ : విన్నుకొండ గౌతమ్, సాక్షి, కొత్తవలస రూరల్, విజయనగరం జిల్లా ఏడాదిలో ప్రకృతి సేద్యంపై పట్టు పూర్తి కాలం వెచ్చించి ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధగా దృష్టి పెట్టిన శంకర్ ఏడాదిలోనే సాగు మెలకువలను వంట పట్టించుకోగలిగారు. ఏకదళ, ద్విదళ పంటలను పక్కపక్కనే సాగు చేయటం, కచ్చితంగా పంటల మార్పిడి పాటించటం, పశువుల ఎరువులో జీవన ఎరువులు కలిపి మాగబెట్టి పొలానికి వెయ్యటం, డ్రిప్ ద్వారా 8 రోజులకోసారి జీవామృతాన్ని పారించటం, కాలానుగుణంగా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వివిధ రకాల కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పప్పుధాన్య పంటల ప్రణాళికను రూపొందించుకొని అనుసరించటం ద్వారా మంచి దిగుబడులను రాబట్టుకోగలుగుతున్నారు. శంకర్ ఆరు ఒంగోలు ఆవులను పోషిస్తున్నారు. పంటలకు తగినంత పోషకాలను అందించే క్రమంలో చేపల మార్కెట్ నుంచి వ్యర్థాలను సేకరించి అమినో ఆమ్లం తయారు చేసి వాడుతున్నారు శంకర్. వంగ సాగులో రెండేళ్ల పాటు పుచ్చుల సమస్యను ఎదుర్కొన్నారు. కాయ తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను అరికట్టడానికి సీవీఆర్ మట్టి పిచికారీ పద్ధతి బాగా ఉపకరించిందని శంకర్ తెలిపారు. గతంలో 60–70% వంకాయల్లో పుచ్చులు వచ్చేవని మట్టి ద్రావణం వల్ల ఇది 10%కి తగ్గిందన్నారు. అయితే, పెసరలో ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులును అదుపు చెయ్యటం ఇంకా సమస్యగానే ఉందన్నారు. 400 నాటు కోళ్లు పెంచుతున్నారు. సజ్జలు, వడ్లతో కూడిన మేతను వేస్తూ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. గౌరవం.. ఆర్థిక స్థిరత్వం.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి మూడేళ్లు దాటింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నా ప్రకృతి వ్యవసాయదారుడిగా రెట్టింపు గౌరవం పొందుతున్నా. పండించిన ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారుడికి అమ్మితేనే మంచి ఆదాయం వస్తుంది. మొదటి ఏడాది సాగులో, మార్కెటింగ్‌లో కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. ఇప్పుడు స్థిమితత్వం వచ్చింది. ఆదాయంతో పాటు సమాజంలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంది. – లింగాల శంకర్ (92933 34477), రెల్లి ,కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా -
తాజా.. మీ సేవలో..
సాక్షి, నెట్వర్క్: కాలం రైతులకు సహకరించింది.. ఆశించిన పంట దిగుబడి రావడంతో వారి కళ్లలో ఆనందం రెట్టింపయ్యింది. ఈ ఏడాది అప్పులు మాయం అవుతాయనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. మాయదారి కరోనా వైరస్‌తో ఆశలన్నీ ఆవిరయ్యాయి. కరోనా మహమ్మారి రైతుల బతుకు చిత్రాన్ని మార్చేసింది. తమ పంటలను విక్రయించుకునేందుకు వారే నగరంలోని కాలనీలు, అపార్ట్మెంట్లకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వారంతపు సంతలు, ఇతర మార్కెట్లపై నియంత్రణ ఉండటం, బోయిన్పల్లి మార్కెట్‌కు తీసుకెళ్తే కనీస ధరలు పలకని దుస్థితి ఉండటంతో రైతులే విక్రేతలుగా మారిపోయారు. రైతులు విక్రయించే కాయగూరలు ఫ్రెష్‌గా ఉండటం, సూపర్ మార్కెట్లతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండటంతో గేటెడ్ కాలనీలు, అపార్ట్ మెంట్లలో ప్రతి వారంలో ఒకటి నుంచి రెండు రోజులు రైతులే ప్రత్యేక వాహనాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పరిశుభ్రతతో పాటు తాజాగా ఉండటంతో రైతు ఉత్పత్తులకు మంచి డిమాండ్ నెలకొంది. గత్యంతరం లేక.. గడపగడపకూ.. మాది నల్లగొండ జిల్లా మాల్. కొన్ని సంవత్సరాలుగా 5 ఎకరాల్లో దొండ, కాకర, టమాటా, బీర వంటి కూరగాయలు సాగు చేస్తున్నాను. ప్రతిరోజు తెల్లవారుజామున కూరగాయలను రెండు ఆటోల్లో నింపుకుని నగరంలోని వారాంతపు సంతలో విక్రయించేవాడిని.. ఈ ఏడాది దిగుబడి బాగా వచి్చంది. కానీ మార్కెట్లు లేకపోవటంతో గడపగడపకు తిరిగి విక్రయిస్తున్నాను. – ఎస్.రవి (మాల్) ఫ్రెష్‌గా ఉండటం వల్లే.. మేం నగరంలో పలు గేటెడ్ కాలనీలకు కాయగూరలు సరపరా చేస్తున్నాం. పొలం నుంచి వినియోగదారుడికే చేరేలా ప్లాన్ చేశాం. కరోనా కారణంగా మాకు మరింత డిమాండ్ పెరిగింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడంతో ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంది. – నరేందర్‌రెడ్డి, రైతు, పరిగి మార్కెట్‌కు తరలించలేక.. కీసరదాయర గ్రామంలో మూడెకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని 2 ఎకరాల్లో వరిపంట సాగుచేశా. మరో ఎకరంలో రూ.10 వేల వరకు ఖర్చుచేసి అర ఎకరంలో వంకాయ, మరో అర ఎకరంలో టమాటా, సొర, కొంత మిర్చి సాగుచేశా. లాక్డౌన్ నేపథ్యంలో కూరగాయాలను మార్కెట్‌కు తరలించలేకపోతున్నా. కానీ స్థానికంగా మండల కేంద్రమైన కీసర సంతలో ప్రతిరోజు విక్రయిస్తున్నా. – సత్తిబాబు కీసర మేమే విక్రయిస్తున్నాం మామూలుగా ఎండాకాలంలో టమాటా ధర కేజీ రూ.30 ఉంటుంది. మార్కెట్లో అమ్మితే రూ.6లు కూడా రావడం లేదు. అందుకే నేరుగా మేమే మా ఉత్పత్తుల వినియోగదారులకు అమ్ముతున్నాం. తాజాగా ఉండటంతో మా దగ్గర కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విక్రయించే సమయంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. – అనసూయ, గుమ్మడిదల ఎకరంలో టమాట సాగుచేశా.. 25 కిలోల బాక్స్‌కు మార్కెట్లో రూ.80 నుంచి రూ.100 అంటే కిలో రూ.4 రూపాయలు కూడా రావడంలేదు. టమాటను తెంపేందుకు కూలీలు కూడా దొరకడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతోనే రోజుకు 20 నుంచి 25 బాక్సుల వరకు టమాటా తెంపి మార్కెట్‌కు తరలిస్తున్నా. మార్కెట్‌కంటే ఇతర కాలనీల్లో అమ్మితే ఎక్కువ ధర వస్తోంది. – దాసరి కృష్ణారెడ్డి, కరీంగూడ -
రైతు బజార్లకు కొత్త హంగులు
సిద్దిపేట జోన్: జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నగర పంచాయతీలుగా గజ్వేల్, జోగిపేట, అందోల్ ఉన్నాయి. పట్టణ ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వాలు ఆయా మున్సిపాలిటీల్లో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో నామమాత్ర వసతులతో ప్రస్తుతం రైతుబజార్లు కొనసాగుతున్నాయి. ఇటీవల రైతుబజార్ల స్థితిగతులు, మార్కెట్ యార్డుల పని తీరుపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. వృధా కూరగాయలతో పారిశుద్ధ్యం కొరవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించింది. అందుకనుగుణంగానే రైతుబజార్లను ఆధునికీకరించడమే కాకుండా శాఖహార, మాంసహార మార్కెట్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సంబంధిత కూరగాయల మార్కెట్ల స్థితి గతులు, ఆధునికీకరణ కోసం ఆయా మున్సిపాల్టీలలో చేపట్టాల్సిన అంశాలను సమగ్రంగా నివేదిక రూపంలో కలెక్టర్‌కు ప్రతిపాదించాలని ఈ నెల 16న రాష్ట్ర డెరైక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేటలో రెండు రోజులుగా మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సంబంధిత జీఓపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిద్దిపేటలోని సుమారు రెండు లక్షల జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రైతు బజార్‌ను తీర్చిదిద్దడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఆరు బయట విక్రయిస్తున్న మాంస, శాఖహార వ్యవస్థను నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందించింది. సిద్దిపేటలో 1,736 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూరగాయల మార్కెట్, 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాంసహార మార్కెట్లను ఏర్పాటు చేయాలని దీనికి తోడు ప్రస్తుతం సిద్దిపేట పట్టణ నడిబొడ్డున ఉన్న రైతు బజార్‌ను మరింత విస్తరించాలని మున్సిపల్ అధికారులు సంకల్పించారు. వీటికి తోడు ఆయా మార్కెట్లను ఎయిర్కండీషనర్తో కొత్త అందాలతో తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటిలో ప్రస్తుతం మాంస విక్రయ మార్కెట్‌కు పట్టణంలో స్థల సేకరణ కోసం రెవెన్యూ విభాగానికి మున్సిపల్ పక్షాన ప్రతిపాదనలు అందజేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ అయిన సిద్దిపేట నుంచే ఈ ప్రక్రియకు జిల్లా అధికారులు శ్రీకారం చుట్టడం, మరోవైపు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించడంతో భవిష్యత్తులో మార్కెట్లు కొత్త కళను సంతరించుకోనున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలలో ఇదే తరహాలో మార్కెట్ యార్డులను ఆధునికీకరించేందుకు ఆయా మున్సిపాల్టీలు ప్రతిపాదనల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నాయి. ఇదే విషయంపై ‘సాక్షి’ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. మార్కెట్ కోసం స్థల సేకరణ చేస్తున్నామని, ఆధునీక సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.