సాక్షి, నెట్‌వర్క్: కాలం రైతులకు సహకరించింది.. ఆశించిన పంట దిగుబడి రావడంతో వారి కళ్లలో ఆనందం రెట్టింపయ్యింది. ఈ ఏడాది అప్పులు మాయం అవుతాయనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. మాయదారి కరోనా వైరస్‌తో ఆశలన్నీ ఆవిరయ్యాయి. కరోనా మహమ్మారి రైతుల బతుకు చిత్రాన్ని మార్చేసింది. తమ పంటలను విక్రయించుకునేందుకు వారే నగరంలోని కాలనీలు, అపార్ట్‌మెంట్లకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వారంతపు సంతలు, ఇతర మార్కెట్లపై నియంత్రణ ఉండటం, బోయిన్‌పల్లి మార్కెట్‌కు తీసుకెళ్తే కనీస ధరలు పలకని దుస్థితి ఉండటంతో రైతులే విక్రేతలుగా మారిపోయారు. రైతులు విక్రయించే కాయగూరలు ఫ్రెష్‌గా ఉండటం, సూపర్ మార్కెట్లతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండటంతో గేటెడ్ కాలనీలు, అపార్ట్ మెంట్లలో ప్రతి వారంలో ఒకటి నుంచి రెండు రోజులు రైతులే ప్రత్యేక వాహనాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పరిశుభ్రతతో పాటు తాజాగా ఉండటంతో రైతు ఉత్పత్తులకు మంచి డిమాండ్ నెలకొంది.
గత్యంతరం లేక.. గడపగడపకూ..
మాది నల్లగొండ జిల్లా మాల్. కొన్ని సంవత్సరాలుగా 5 ఎకరాల్లో దొండ, కాకర, టమాటా, బీర వంటి కూరగాయలు సాగు చేస్తున్నాను. ప్రతిరోజు తెల్లవారుజామున కూరగాయలను రెండు ఆటోల్లో నింపుకుని నగరంలోని వారాంతపు సంతలో విక్రయించేవాడిని.. ఈ ఏడాది దిగుబడి బాగా వచి్చంది. కానీ మార్కెట్లు లేకపోవటంతో గడపగడపకు తిరిగి విక్రయిస్తున్నాను. – ఎస్.రవి (మాల్)
ఫ్రెష్‌గా ఉండటం వల్లే..
మేం నగరంలో పలు గేటెడ్ కాలనీలకు కాయగూరలు సరపరా చేస్తున్నాం. పొలం నుంచి వినియోగదారుడికే చేరేలా ప్లాన్ చేశాం. కరోనా కారణంగా మాకు మరింత డిమాండ్ పెరిగింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడంతో ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంది.
– నరేందర్‌రెడ్డి, రైతు, పరిగి
మార్కెట్‌కు తరలించలేక..
కీసరదాయర గ్రామంలో మూడెకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని 2 ఎకరాల్లో వరిపంట సాగుచేశా. మరో ఎకరంలో రూ.10 వేల వరకు ఖర్చుచేసి అర ఎకరంలో వంకాయ, మరో అర ఎకరంలో టమాటా, సొర, కొంత మిర్చి సాగుచేశా. లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయాలను మార్కెట్‌కు తరలించలేకపోతున్నా. కానీ స్థానికంగా మండల కేంద్రమైన కీసర సంతలో ప్రతిరోజు విక్రయిస్తున్నా.
– సత్తిబాబు కీసర
మేమే విక్రయిస్తున్నాం
మామూలుగా ఎండాకాలంలో టమాటా ధర కేజీ రూ.30 ఉంటుంది. మార్కెట్‌లో అమ్మితే రూ.6లు కూడా రావడం లేదు. అందుకే నేరుగా మేమే మా ఉత్పత్తుల వినియోగదారులకు అమ్ముతున్నాం. తాజాగా ఉండటంతో మా దగ్గర కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విక్రయించే సమయంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
– అనసూయ, గుమ్మడిదల
ఎకరంలో టమాట సాగుచేశా..
25 కిలోల బాక్స్‌కు మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100 అంటే కిలో రూ.4 రూపాయలు కూడా రావడంలేదు. టమాటను తెంపేందుకు కూలీలు కూడా దొరకడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతోనే రోజుకు 20 నుంచి 25 బాక్సుల వరకు టమాటా తెంపి మార్కెట్‌కు తరలిస్తున్నా. మార్కెట్‌కంటే ఇతర కాలనీల్లో అమ్మితే ఎక్కువ ధర వస్తోంది.
– దాసరి కృష్ణారెడ్డి, కరీంగూడ
Comments
Please login to add a commentAdd a comment