సిద్దిపేట జోన్: జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నగర పంచాయతీలుగా గజ్వేల్, జోగిపేట, అందోల్ ఉన్నాయి. పట్టణ ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వాలు ఆయా మున్సిపాలిటీల్లో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో నామమాత్ర వసతులతో ప్రస్తుతం రైతుబజార్లు కొనసాగుతున్నాయి.
ఇటీవల రైతుబజార్ల స్థితిగతులు, మార్కెట్ యార్డుల పని తీరుపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. వృధా కూరగాయలతో పారిశుద్ధ్యం కొరవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించింది. అందుకనుగుణంగానే రైతుబజార్లను ఆధునికీకరించడమే కాకుండా శాఖహార, మాంసహార మార్కెట్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సంబంధిత కూరగాయల మార్కెట్ల స్థితి గతులు, ఆధునికీకరణ కోసం ఆయా మున్సిపాల్టీలలో చేపట్టాల్సిన అంశాలను సమగ్రంగా నివేదిక రూపంలో కలెక్టర్‌కు ప్రతిపాదించాలని ఈ నెల 16న రాష్ట్ర డెరైక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
సిద్దిపేటలో రెండు రోజులుగా మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సంబంధిత జీఓపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిద్దిపేటలోని సుమారు రెండు లక్షల జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రైతు బజార్‌ను తీర్చిదిద్దడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఆరు బయట విక్రయిస్తున్న మాంస, శాఖహార వ్యవస్థను నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందించింది. సిద్దిపేటలో 1,736 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూరగాయల మార్కెట్, 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాంసహార మార్కెట్లను ఏర్పాటు చేయాలని దీనికి తోడు ప్రస్తుతం సిద్దిపేట పట్టణ నడిబొడ్డున ఉన్న రైతు బజార్‌ను మరింత విస్తరించాలని మున్సిపల్ అధికారులు సంకల్పించారు.
వీటికి తోడు ఆయా మార్కెట్లను ఎయిర్‌కండీషనర్‌తో కొత్త అందాలతో తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటిలో ప్రస్తుతం మాంస విక్రయ మార్కెట్‌కు పట్టణంలో స్థల సేకరణ కోసం రెవెన్యూ విభాగానికి మున్సిపల్ పక్షాన ప్రతిపాదనలు అందజేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ అయిన సిద్దిపేట నుంచే ఈ ప్రక్రియకు జిల్లా అధికారులు శ్రీకారం చుట్టడం, మరోవైపు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించడంతో భవిష్యత్తులో మార్కెట్‌లు కొత్త కళను సంతరించుకోనున్నాయి.
ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలలో ఇదే తరహాలో మార్కెట్ యార్డులను ఆధునికీకరించేందుకు ఆయా మున్సిపాల్టీలు ప్రతిపాదనల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నాయి. ఇదే విషయంపై ‘సాక్షి’ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. మార్కెట్ కోసం స్థల సేకరణ చేస్తున్నామని, ఆధునీక సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
రైతు బజార్లకు కొత్త హంగులు
Published Sat, Sep 20 2014 11:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement