ఆకాశంలో మబ్బులు.. గుండెల్లో గుబులు
- రైతన్నకు తప్పని తిప్పలు
- వెంటాడుతున్న వరుణుడు
- ముందుకు సాగని కొనుగోళ్లు
- సిద్దిపేటలో నిలిచిన బీట్
- ఉన్న ధాన్యానికే అధికారుల అనుమతి
- వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఆకాశంలో మబ్బులు.. అన్నదాతకు గుబులు రేపుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోళ్లకు ప్రతిబంధకంగా మారుతోంది. మూడు రోజలుగా అడపాద డప చిరుజల్లులు కురుస్తుండటంతో సిద్దిపేట మార్కెట్ యార్డు అధికారులు గురువారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. అయితే బుధవారం నాటికే యార్డుకు వేలాది క్వింటాళ్ల ధాన్యం రావడం.. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొనడమేకాక, కొనుగోళ్ల ప్రక్రియ అగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే...
సిద్దిపేట మార్కెట్ యార్డుకు జిల్లా నుంచే కాక ప్రతియేటా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సమీప గ్రామాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తరలిస్తుంటారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు కేంద్రాలను నేటికీ ప్రారంభించలేదు. అయినప్పటికీ సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లోని లెసైన్స్ వ్యాపారులు ఈనెల మూడు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ యార్డుకు ధాన్యం పోటెత్తుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో రైతులు ముందుజాగ్రత్తగా కల్లాల్లోంచే నేరుగా ధాన్యాన్ని యార్డ్‌కు తరలిస్తున్నారు. రోజూ సుమారు 10 క్వింటాళ్ల ధాన్యం బీట్ నిమిత్తం యార్డుకు వస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం సుమారు 13 వేల క్వింటాళ్ల ధాన్యం వచ్చింది.
యార్డులోని షెడ్‌లతో పాటు ఆరు బయట ధాన్యాన్ని రాశులుగా పోశారు. కాగా కురుస్తున్న చిరు జల్లుల నేపథ్యంలో యార్డులోని ధాన్యానికి సరిపడా టార్పాలిన్ల పంపిణీలో మార్కెట్ అధికారులు వైఫల్యం చెందారనే ఆరోపణలున్నాయి. మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన.. అటు రైతుల్లో.. ఇటు మార్కెట్ యార్డు అధికారుల్లో వణుకు పుట్టించిందనే చెప్పాలి.
యార్డులో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు ఉండడం, వాటి బీట్ నిర్వహణ అధికారులకు తలకు మించిన భారంగా మారడంతో ముందు జాగ్రత్తంగా గురువారం సిద్దిపేట మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. అన్నదాతలు ధాన్యాన్ని తీసుకురావద్దని బహిరంగ ప్రకటన చేశారు. దీంతో యార్డ్‌లో ఉన్న 13 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రాత్రంతా బీట్ నిర్వహించి, త్వరితగతిన గోదాంలకు తరలించారు. ఈ క్రమంలో గురువారం క్రయవిక్రయాలు లేక సిద్దిపేట మార్కెట్ యార్డు వెలవెల బోయింది.