సిద్దిపేట రూరల్: ఐదు కోట్ల రూపాయల భూమికి సంబంధించిన రికార్డులను అక్రమంగా మార్చేసిన బాగోతంలో సూత్రధారులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత్రధారులను... సూత్రధారులుగా నమ్మించి బలిపీఠం ఎక్కించేందుకు పావులు కదులుతున్నాయి. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘రెవెన్యూ రికార్డుల గోల్‌మాల్’ కథనం నేపథ్యంలో... నిబంధనలు తుంగలో తొక్కి ఈ వ్యవహారాన్ని మలుపు తిప్పేందుకు తెరచాటు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ భూబాగోతానికి సంబంధించి విశ్వసనీయ వర్గాల నుంచి ‘సాక్షి’ మరింత కీలక సమాచారం సేకరించింది.
సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామ శివారు ప్రధాన రోడ్డు సమీపంలో ఉన్న గుగ్గిల్ల వేణు (సర్వే నంబరు 318/1లో 12.38 ఎకరాలు, సర్వే నంబరు 339లో 5.05 ఎకరాలు) భూమి అక్రమ బదిలీలో లక్షలు చేతులు మారినట్టు సమాచారం.
ఈ అక్రమానికి తెరతీసిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది... రెవెన్యూ రికార్డుల్లోని పహానీల్లో తొగిట పద్మ పేరున ఈ నెలలోనే 6.19 ఎకరాల స్థలాన్ని సర్వే నంబరు 318/2లో ఉన్నట్టు సృష్టించారు. అలాగే ఆమె పేరు మీదే 2.24 ఎకరాల స్థలాన్ని సర్వే నంబరు 339/4లో ఉన్నట్లు రికార్డులు మార్చేశారు. ఇందుకు సంబంధించిన సెక్షన్ అధికారి, తహశీల్దార్ సంతకాలను సంబంధిత పత్రాలపై చేయడంతో కంప్యూటర్ రికార్డుల్లోకి చేరిపోయింది. దీన్ని గమనించిన బాధితుడు వేణు... తహశీల్దార్‌కు విషయాన్ని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన తహశీల్దార్ మొత్తం తతాంగాన్ని మార్చేశాడు.
ఎన్నెన్నో అనుమానాలు
బాధితుడు వేణు ఫిర్యాదు చేసిన నాలుగైదు రోజుల వరకు తహశీల్దార్ స్పందించలేదు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ కథనం ప్రచురించే యత్నంలో.. తహశీల్దార్ ఎన్‌వై గిరిని వివరణ కోరింది. దీంతో ఆయన ‘అప్రమత్త’మై విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు మంగళవారం ఆగమేఘాలపై ‘కొన్ని పత్రిక’ల ప్రతిని ధులతో సమావేశమమై వివరాలను వెల్లడించారు. ఈ సమావేశానికి ‘సాక్షి’ ప్రతినిధిని ఆహ్వానించలేదు. అధికారి చెప్పినట్టే.. తెల్లారి సదరు పత్రికల్లో వీఆర్వో శ్రీకాంత్‌రెడ్డిని బాధ్యుడిని చేస్తూ కథనాలు వచ్చాయి. కానీ వాస్తవ విషయాలతో కూడిన సమగ్ర కథనాన్ని విభిన్న రూపంలో ‘సాక్షి’ ప్రచురించింది.
సంతకం వెనక..?
రికార్డులో పేరు మార్చాలంటే పూర్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో వీఆర్వో, ఆర్‌ఐ, సెక్షన్ అధికారి, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్‌లు సంతకాలు చేయాలి. కానీ, ఆ నివేదికలో ఒక్క సెక్షన్ అధికారి, తహశీల్దార్ సంతకాలు మాత్రమే ఉన్నాయి. సంతకాలను ఫోర్జరీగా అభివర్ణిస్తున్న తహశీల్దార్ సమస్య వెలుగులోకి వచ్చే వరకు ఎందుకు స్పందించలేదన్న అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతోంది. మరోవైపు విషయాన్ని ముందుగానే జిల్లా కలెక్టర్‌కు నివేదిక రూపంలో తెలియజేయడం వెనుక ఆంతర్యం ఏంటీ? సంబంధిత సంతకంపై పూర్తి స్థాయి వివరాలు బహిర్గతం కావాలంటే సమగ్ర దర్యాప్తు నిర్వహించాల్సిందే.
నాకేం తెలియదు...
ఈ వ్యవహారంపై వీఆర్వో శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా... ‘మిట్టపల్లి భూమి మార్పిడికి సంబంధించి నాకేం తెలియదు. ప్రమాదం జరిగి కొన్ని రోజులుగా నేను ఇంట్లోనే ఉంటున్నా. నన్నీ విషయంలో బలిపశువును చేస్తున్నారు. జిల్లా అధికారులు విచారణకు సహకరిస్తా’ అన్నారు.
విచారిస్తాం...
ఈ వ్యవహారం పత్రికల ద్వారా తెలిసింది. ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నా. దీనిపై సమగ్ర విచారణ చేస్తాం. తహశీల్దార్ సంతకం ఫోర్జరీపై అవసరమైతే ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటాం. డీఏఓకు విచారణ బాధ్యతలు అప్పగించా. పూర్తికాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
- ముత్యంరెడ్డి, ఆర్డీఓ సిద్దిపేట
ఫోర్జరీ నాటకం
Published Thu, Jun 25 2015 1:27 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement