సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) కార్యాలయ ఫర్నిచర్ అన్నదాతల ఆగ్రహానికి తునాతునకలైంది. కొన్ని నిమిషాలు కార్యాలయం రణరంగమైంది. ఏఎంసీ యార్డులను మంగళవారం ఉదయమే మొక్కజొన్నలు ముంచెత్తాయి. సుమారు 4,500 క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి వచ్చాయి. ట్రేడర్లు వ్యూహాత్మకంగా ధరలను తగ్గించడంతో రైతులు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. కనీస మద్దతు ధర రూ.1,310 ఉండగా.. కనిష్ట రేటు రూ.1,100, గరిష్ట ధర రూ.1,274గా నిర్ణయించారు. కాగా కొన్ని రాశులకైతే కేవలం రూ.వెయ్యేనని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు వేలం పాటలను అడ్డుకున్నారు. ‘ధర తగ్గించి మా నోట్లో మట్టి కొట్టకుండ్రి...’ అంటూ ఎంత అర్థించినా అరణ్య రోదనే కావడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఏఎంసీ ఆఫీసులోకి దూసుకెళ్లి కుర్చీలను విరగొట్టారు. బీరువాను పడేశారు. భయంతో సిబ్బంది కంప్యూటర్ గదికి గొళ్లెం వేశారు. ఇంతలో రంగంలోకి దిగిన పోలీసులతో బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఖాకీలు వారించడంతో ఆఫీసు విడిచి రెండోసారి రోడ్డెక్కారు. ఇన్ని రోజులు శాంతియుతంగా రాస్తారోకోలకు పరిమితమైన అన్నదాతలు ఎటూ పాలుపోని స్థితిలో ఆఫీసు ఫర్నిచర్‌పై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దీంతో అధికారులు దిగొచ్చారు. మార్‌కఫెడ్ వాళ్లు ఖరీదు చేయాలంటే వ్యవసాయ శాఖ అధికారులు తేమ శాతాన్ని నిర్ధారించాలి. వ్యవసాయ శాఖ వారిని ముందే సంప్రదించామని, అయితే వాళ్లు సకాలంలో స్పందించలేదని ఏఎంసీ కార్యదర్శి సంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో సంగయ్య స్వయంగా పత్తి మార్కెట్‌కు వెళ్లి అక్కడున్న ఓ వ్యవసాయాధికారిని ఏఎంసీకి తీసుకొచ్చారు. మద్దతు ధరకే మార్‌కఫెడ్ కొనుగోలు చేస్తుందంటూ ఏఎంసీ కార్యదర్శి సంగయ్య రోడ్డుపై ఉన్న రైతులకు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
రైతన్నల ఆక్రోశం
Published Wed, Oct 9 2013 3:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement