► ముందుకు సాగని సేంద్రియ ఎరువు యూనిట్లు హా రూ.11.46 కోట్ల పెండింగ్
► ఆరు నెలలుగా మంజూరుకాని బిల్లులు
► మూడేళ్లుగా నెరవేరని లక్ష్యం
ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల రోగాలకు కారణం రసాయనిక ఎరువులతో పండించిన పంటలు. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2015లో వర్మీకంపోస్టు పథకాన్ని తీసుకొచ్చారు. రైతులు తమకు అనువుగా ఉన్న పొలాల్లో కంపోస్టు షెడ్లు నిర్మించుకునే విధంగా రూపకల్పన చేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం నత్తనడకన సాగుతోంది.
గుర్రంకొండ: ప్రజల ఆరోగ్యంతో పాటు, రైతుల ఆదా యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన వర్మీకంపోస్టు యూనిట్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది. యూనిట్ల నిర్మాణంపై రైతులు ఆసక్తి కనబరిచినా ఆరు నెలలుగా వీటికి సంబం ధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ కారణంగా గడిచిన మూడేళ్లలో సరాసరి 70 శాతం యూనిట్ల నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. పలు గ్రామాల్లో నిర్మించుకున్న యూని ట్లలో ఎరువులు తయారు చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. పైగా వీటికోసం చేసిన ఖర్చు రైతులకు అదనపు భారంగా మారింది.
యూనిట్ నిర్మాణ విలువ..
ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక యూనిట్ నిర్మాణానికి రూ.18 వేలు మంజూరు చేస్తారు. మొదటి దశలో పునాది వేస్తే రూ.1000, రెండో దశలో తొట్టె నిర్మాణాలు పూర్తి చేస్తే రూ.12 వేలు, మూడో దశలో పందిరి, ఎరువులు వేసుకుంటే రూ.3000, నాలుగో దశలో వానపాములను కొనుగోలు చేసి తొట్టెల్లో వేస్తే రూ.2000 ఇలా మొత్తం రూ.18 వేలు మంజూరు చేస్తారు. రెండు తొట్టెలను మూడు అడుగుల వెడల్పు, ఏడు అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తుతో నిర్మించాల్సి ఉంటుంది.
ఎరువుల తయారీ ఇలా..
నిర్మాణం పూర్తయిన తొట్టెల్లో ఆవు పేడ నింపాల్సి ఉం టుంది. వానపాములను తొట్టెలోని ఎరువులో వేసి కలియబెడతారు. నాలుగు నెలల తర్వాత వానపాములను, సేంద్రియ ఎరువు నుంచి వేరుచేస్తారు. అలా వేరుచేసిన దాన్నే వర్మీకంపోస్టు ఎరువుగా పిలుస్తారు. ఇందులో రసాయనిక ఎరువులైన కాంప్లెక్సు, యూరియాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. రసాయనిక ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతినడమేగాక భూమి గుల్ల అవుతుంది. అదే వర్మీకంపోస్టు ఎరువు వినియోగంతో పంటకు అన్ని రకాల రోగాల నుంచి రక్షణతో పాటు మొక్కల ఎదుగుదల, పంట అధిక దిగుబడికి తోడ్పడుతుంది. మార్కెట్లో వర్మీకంపోస్టు ఎరువులకు ఎక్కువ డిమాండ్ ఉండడం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితి..
ఈ ఏడాది మార్చి నుంచి చేపట్టిన వర్మికంపోస్టు యూనిట్ల నిర్మాణాలకు సంబంధించి రూ.11.46 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న రైతులు బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకుని ఎరువుల ఉత్పత్తి ప్రారంభం కానివి 5,266 యూనిట్లు ఉన్నాయి. పలుచోట్ల ఐకేపీ అధికారులు రైతులకు వానపాములు సకాలంలో పంపిణీ చేయలేదు. మరికొన్ని చోట్ల వానపాములకు సంబంధించి బిల్లులు చేతికందకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కనీసం రబీ సీజన్‌కైనా సంప్రదాయ ఎరువులతో వ్యవసాయ చేద్దామనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి.
బిల్లులు ఇవ్వలేదు..
వర్మీకంపోస్టు యూ నిట్ నిర్మించుకుని నెలలు గడస్తున్నా ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. రెండు బిల్లులు పెండింగ్‌లో ఉంచారు. బిల్లులు ఇస్తే మిగతా పనులు పూర్తి చేసుకుంటాం. సేద్యానికి వర్మీకంపోస్టు ఎరువు ఎంతో అవసరం. అధికారులు బిల్లులు వెంటనే మంజూరు చేయాలి. – పార్వతమ్మ, కొత్తపల్లె
వానపాములు ఇస్తే ఎరువులు తయారు చేసుకుంటాం..
మేము వర్మీకంపోస్టు యూని ట్లు కట్టుకుని ఐదు నెలలకు పైగా గడుస్తోంది. అధికారులు రెండు బిల్లులు పెండింగ్‌లో ఉంచారు. కనీసం వానపాములునైనా ఇస్తే ఎరువు తయారు చేసుకుంటాం. ఇప్పటికే ఆవుపేడ తొట్టెల్లో నింపుకున్నాం. రానున్న వ్యవసాయ పనులకు ఈ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. – కమలమ్మ, చిట్టిబోయనపల్లె
సేంద్రియ ‘బరువు’
Published Tue, Aug 22 2017 2:52 AM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM
Advertisement
Advertisement