వరిలో ఎరువుల యాజమాన్యం ఇలా..
- ఎరువులు ఎక్కువ వాడితే చీడపీడల ముప్పు
- భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా వాడుకోవాలి
- పరీక్షలు చేయంచకుంటే వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలి
సార్వా వరిసాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటంలేదు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని తమ పొలంలోనూ అవసరం ఉన్నాలేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువుల యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తేనే అధిక దిగుబడులు వస్తాయని మండవల్లి సబ్ డివిజన్ ఏడీఏ ఈదా అనిల్‌కుమారి సూచిస్తున్నారు. ఎరువుల వినియోగం ఆమె మాటల్లోనే..
ఎరువుల వినియోగంలో రైతులకు సరైన అవగాహన లేనందువల్ల అటు ఆర్థికంగా, ఇటు దిగుబడుల పరంగా నష్టపోతున్నారు. నీటి యాజమాన్యంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంలోనూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి. వరిసాగులో రసాయన ఎరువులపై రైతులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. భూసార పరీక్షలు చేయించనప్పుడు ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 నుంచి 16 కిలోల పొటాష్ లభించే ఎరువులను మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే పొలంపై తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది.
మూడు విడతలుగా యూరియా చల్లుకోవాలి
వరిపైరు పెరిగేందుకు నత్రజని ఎంతగానో దోహదపడుతుంది. దీనిని మూడు దఫాలుగా పొలంలో చల్లుకోవాలి. నాట్లు వేసే ముందు, దుబ్బు చేసే దశలో, అంకురం ఏర్పడే దశలో నత్రజనిని అందిచే ఎరువులను వాడుకోవాలి. నత్రజని పోషకాన్ని సరైన మోతాదులో అందించేందుకు యూరియా వాడే విధానంపై రైతులు అవగాహన కల్పించుకోవాలి. ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని అందించాలంటే 55 నుంచి 70 కిలోల యూరియాను పొలంలో చల్లుకోవాలి. దీనిని మూడు సమ భాగాలుగా విభజించి చల్లుకోవాల్సి ఉంటుంది. పైరు పెరుగుదల ఆశించిన రీతిలో లేకుంటే అదనంగా 10 నుంచి 15 కిలోల వరకు యూరియా వాడవచ్చు. యూరియా అధిక వినియోగం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయి. యూరియా ఎక్కువైతే వరి మొక్కల ఆకుల్లో పత్రహరితం అధికంగా ఉంటుంది. ఫలితంగా పురుగులు దాడిచేస్తాయి. అగ్గితెగులు, ఆకుముడత తెగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
భాస్వరం సకాలంలో అందించాలి
మొక్కల వేరుల పెరుగుదలకు పోషక పదార్థంగా భాస్వరం ఉపయోగ పడుతుంది. దీనిని నాట్లు వేసేముందు దమ్ములో లేదా నాట్లు వేసిన 15 రోజుల్లోపు కాంప్లెక్స్ ఎరువుగా వాడాల్సి ఉంటుంది. నాట్లు వేసిన 15 రోజుల తరువాత ఈ ఎరువును పొలంలో చల్లుకున్నా ఉపయోగం ఉండదు. అయితే పొలంలో జింకులోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఎరువును సకాలంలో పైరుకు అందిస్తేనే మొక్కల ఎదుగుదల, దిగుబడులు బాగుంటాయి.
పొటాష్‌తో రోగని రోధక శక్తి
వరి మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి అవసరమైన పోషకాలను మొక్కలోని వివిధ భాగాలకు సరఫరా చేయడానికి పొటాష్ ఉసయోగపడుతుంది. వరి పంటకు అవసరమయ్యే 12 నుంచి 16 కిలోల పొటాష్ అందించేందుకు 20 నుంచి 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను పొలంలో చల్లుకోవాలి. దీనిని రెండు సమ భాగాలుగా చేసి మొదటి దఫా, రెండో దఫా యూరియాతో కలిపి వేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.