నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా జిల్లాలోని పప్పుల మిల్లులు, దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మంగళ, బుధవారాల్లో దాడులు నిర్వహించారు. ఏడు దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేయగా, 1,600 క్వింటాళ్ల సరుకు స్వాధీనం చేసుకున్నారు. కోవూరులో ఓ మిల్లును సీజ్ చేశారు. విజిలెన్స్ ఎస్పీ శశిధర్‌రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎస్‌ఎం రమేష్‌బాబు తన బృందంతో కలిసి వింజమూరు, కలిగిరి, వెంకటగిరి, పోతిరెడ్డిపాలెం, నెల్లూరులో రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు. 15 పప్పుల మిల్లులు, దుకాణాలను తనిఖీ చేసి లెసైన్సులు, స్టాక్‌రిజిస్టర్లు, సరుకు నిల్వలను పరిశీలించారు. నిల్వల్లో భారీస్థాయిలో తేడాలు ఉండడంతో ఏడు దుకాణాలపై నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ. 80 లక్షలు విలువైన 1,600 క్వింటాళ్ల వివిధ రకాల పప్పుదినుసులను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు పప్పులవీధిలోని రమేష్‌ట్రేడర్స్, షరాబు పెద్ద ఓబయ్య సన్స్‌కు చెందిన దుకాణాలు, గోదాములను బుధవారం రాత్రి తనిఖీ చేసుకున్నారు. వీటిలోనే రూ.20 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకోని, అనధికార గోదాములను సీజ్ చేశారు. విజిలెన్స్ దాడులతో వ్యాపారులు బెంబేలెత్తారు. నిత్యం వ్యాపారులతో కళకళలాడే పప్పులవీధి బోసిపోయింది. దాడుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు సంగమేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఏవో ధనుంజయ్, డీసీటీవో రవికుమార్, మోహన్, డీఈ సుధాకర్, సివిల్‌సప్లయిస్ అధికారులు ఎ. వెంకటేశ్వర్లు, లక్ష్మణబాబు తదితరులు పాల్గొన్నారు.
పప్పుల మిల్లు సీజ్
కోవూరు: పోతిరెడ్డిపాళెంలోని శ్రీ వెంకటశివసాయి పప్పులమిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో 318 క్వింటాళ్ల శనగలకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడంతో మిల్లును సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సరుకు విలువ రూ.7.70 లక్షలు ఉంటుందన్నారు. దాడుల్లో డీఈ సుధాకర్, ఏజీ రమణ, ఎస్సై రామయ్య, ఆర్‌ఐ అనురాధ, వీఆర్వో ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పప్పుల వ్యాపారంపై ‘విజిలెన్స్’
Published Thu, Apr 17 2014 4:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement