మళ్లీ కూలిన కొండ చరియలు
సాక్షి, తిరుమల: తిరుమలకు కొండ చరియల ముప్పు కొనసాగుతోంది. ఇప్పటికే రెండో ఘాట్‌రోడ్డు ధ్వంసమైంది. ఆదివారం కురిసిన వర్షానికి ఈ రోడ్డుతోపాటు శ్రీవారి మెట్ల మార్గం (శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమల కాలిబాట) లోనూ భారీకొండ చరియలు కూలాయి. రాళ్ల ధాటికి నడకదారి షెడ్లు ధ్వంసమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. శ్రీవారి మెట్టు నడకమార్గంలోని 1700 మెట్ల నుంచి 1800 వరకు మధ్యలో భారీగా కొండ చరియలు కూలాయి. పై నుంచి రాళ్లు పడడంతో షెడ్లు కూలిపోయాయి. మెట్ల మార్గం మొత్తం బండరాళ్లతో నిండిపోయింది. టీటీడీ అధికారులు ముందుజాగ్రత్తగా మెట్లమార్గాన్ని మూసివేయడంతో భక్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. తాజా ఘటనతో శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరణకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
రెండోఘాట్‌లోనూ ..
రెండో ఘాట్‌రోడ్డులో 8 నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు కూలాయి. 12వ కిలోమీటరు వద్ద, 13వ కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు భారీ సంఖ్యలో రాళ్లు కూలాయి. సోమ, మంగళవారాల్లో వర్షం తీవ్రత మరింతగా ఉంటే దాని ప్రభావం కొండచరియలపై ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలకుతోడు కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటలకే తిరుమల రెండు ఘాట్‌రోడ్లను మూసివేశారు.
సాధారణంగా రోజూ రాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్య రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ముందు జాగ్రత్తచర్యగా పదిన్నర గంటలకే రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా తిరుమల-తిరుపతి, తిరుపతి-తిరుమల మధ్య ఆగిపోయిన రాకపోకలను సోమవారం వేకువజామున 4.30 గంటలకు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇదేవిధంగా రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ విధంగా తిరుమల చరిత్రలో ఒకేసారి రెండు ఘాట్‌రోడ్లను రాత్రి పదిన్నర గంటలకే మూసివేయడం ఇదే ప్రథమం.