పచ్చ చొక్కా.. అక్రమాలు పక్కా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: క్వారీల్లో భారీ పేలుళ్లకు పాల్పడి , ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్న ఓ టీడీపీ నేతను విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే అతనిపై క్రిమినల్ కేసు నమోదుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నింది తుడి అరెస్టు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం సమీపంలో ఓ వ్యక్తి అనధికారికంగా క్వారీ నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది.
ఆ మేరకు సోమవారం వివిధ విభాగాల అధికారులతో కలిసి దాడి చేశారు. కొన్ని జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లతో సహా పేలుళ్లకు ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. జాతీయ రహదారికి ఆనుకొని.. దేవాలయం, విద్యాలయం సమీపంలో గ్రామస్తులకు ఇబ్బంది కలిగేలా కొన్నాళ్లుగా అక్రమ క్వారీ నిర్వహిస్తున్న ఆ వ్యక్తి టీడీపీ నేత అని తెలిసింది. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే రోడ్డు మెటల్ సహా, వివిధ రకాల మెటల్ చిప్స్ కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. దాడులు జరిపిన విజిలెన్స్ ప్రత్యేక బృందాలు పంచనామా అనంతరం స్థానిక తహశీల్దార్‌కు సదరు వ్యక్తిని, సామగ్రిని అప్పగించారు.
ఒత్తిళ్ల మంత్రాంగం
నిందితుడు మరో 10మందితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. పల్లెవలస, సింగుపురం, తండేవలస సమీప ప్రజలతో పాటు అక్కడి దేవాలయ అధికారులు, పూజారులు ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. అదే విధంగా అక్రమాల కు పాల్పడుతున్న వ్యక్తి టీడీపీకి చెందినవాడు కావడంతో ఆ పార్టీ నేతల నుంచి పోలీసు, రెవెన్యూ వర్గాలపై కేసు నమోదు చేయొద్దని ఒత్తిళ్తు మొదలయ్యా యి. ఒకవేళ కేసు పెట్టినా చిన్న కేసు నమోదు చేసి అ రెస్టు చూపించాలని సూచిస్తున్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి కొందరు రెవెన్యూ అధికారులకు బంధువని తేలింది. దీంతో అతని అరెస్టు విషయంలో తత్సారం చేస్తున్నారు. క్వారీ ప్రాంతాన్ని క్రమబద్ధీకరించడంలో, వన్ ప్లస్ ఫైవ్ చొప్పున అపరాధ రుసుం (సీనరేజీ) వసూలు చేసే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్టు తెలిసింది.
అబ్బే ఇది చిన్న కేసే: తహశీల్దార్
ఈ విషయమై స్థానిక తహశీల్దార్ దిలీప్ చక్రవర్తిని ‘సాక్షి’ వివరణ కోరగా తనిఖీల సమయంలో తాను ఊళ్లో లేనని, విషయం తెలిసిన వెంటనే వివరాల్ని పోలీసులకు తెలియజేశానని చెప్పారు. ఇది చిన్న కేసేనని, ఇలాంటివి చాలా జరుగుతుంటాయని కూడా చెప్పారు. నివేదిక రికార్డు చేసి రూరల్ పోలీసులకు అప్పగించేశామన్నారు. ఇదే విషయమై రూరల్ పోలీసులను వివరణ కోరగా తమకు మంగళవారం సాయంత్రమే కేసు అప్పగించారని, త్వరలో అరెస్టు చేస్తామని వివరణ ఇచ్చారు.