యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుండడంతో దేవస్థానంపై విజిలెన్స్ అధికారులు రక్షణ చర్యలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆలయంలో ఎక్కడా అవినీతి చోటుచేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి రహిత పాలన అందిస్తాననడం, ఏ అధికారి లంచమడిగినా తనకు ఫోన్ చేయమని బహిరంగంగా ప్రకటించడం తో ఆలయంలో అవినీతి కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
త్వరలో గుట్ట బ్రహ్మోత్సవాలు ఉండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు అధికారులు వేర్వేరుగా పర్యటిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దర్శనాలకు, కొండపై వచ్చే వాహనాలతో, ఈఓ కార్యాలయంలో అధికారులకు చేయి తడపనిదే పని జరగదంటూ ఆరోపణలు వినిపిస్తుండడంతో విజిలెన్స్ అధికారులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు మఫ్టీలో తిరుగుతూ హోంగార్డులు, ఎస్పీఎఫ్, ఆలయ సిబ్బంది పనితీరు పసిగడుతున్నారని విశ్వసనీయ సమాచారం. దేవస్థానంలో అవినీతి కార్యకలాపాలను కనిపెట్టడమే పని కావడంతో రహస్య తనిఖీలు చేపడుతున్నారు.