భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని చేపలు, రొయ్యల చెరువులపై ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 32 బృందాలు మూడు రోజులపాటు చెరువులకు సంబంధించి 3,793 సర్వీసులను తనిఖీలు చేశారుు. నిబంధనలకు విరుద్ధంగా 356 సర్వీసులను వినియోగిస్తున్న చెరువుల యజమానులపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ ఎస్‌ఈ ఎన్.గంగాధర్ శుక్రవారం భీమవరంలో విలేకరులకు వెల్లడించారు. ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, తాడేపల్లిగూడెం డివిజన్లలో 5,200 చేపలు, రొయ్యల చెరువులకు సంబంధించి విద్యుత్ సర్వీసులు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఒక్క భీమవరం డివిజన్‌లోనే 4,280 సర్వీసులు ఉన్నాయన్నారు. విద్యుత్ చోరీ, అవకతవకలు, అదనపు లోడు వినియోగం, బ్యాక్ బిల్లింగ్‌లకు పాల్పడుతున్నారన్న సమాచారం అందడంతో ఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 13వరకు తనిఖీలు నిర్వహించనట్లు చెప్పారు. 3,593 సర్వీసులను తనిఖీ చేసి, 356 కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో 28 విద్యుత్ చోరీ, 31 అవకతవకలు, 218 అదనపు లోడు కింద కేసులు నమోదు చేశామన్నారు. రీడింగ్ సక్రమంగా తీయకపోవడాన్ని గుర్తించి 79 కేసులు పెట్టామని చెప్పారు. సంబంధిత వ్యక్తుల నుంచి రూ.32 లక్షలు వసూలు చేస్తామన్నారు. సమావేశంలో భీమవరం డీఈ పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఆక్వాకు ట్రాన్స్‌కో ‘షాక్’
Published Sat, Dec 14 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement